రక్షణ మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న సైనిక అధికారి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం అరెస్ట్ చేసింది. ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి రూ.3 లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు ఢిల్లీతో పాటు బెంగళూరు, శ్రీగంగానగర్, జమ్మూ ప్రాంతాల్లో కొనసాగుతోంది.
సీబీఐ సమాచారం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలకు రక్షణ ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల విషయంలో అక్రమ లాభాలు చేకూర్చేలా శర్మ కుట్ర పన్నినట్టు ఆరోపణ. బెంగళూరుకు చెందిన కంపెనీ వ్యవహారాలను రాజీవ్ యాదవ్, రవ్జీత్ సింగ్ నిర్వహించగా, వారితో శర్మ నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ కంపెనీకి విదేశీ లింకులు ఉన్నాయని, ప్రధాన కార్యాలయం దుబాయ్ లో ఉందని సీబీఐ తెలిపింది.
డిసెంబర్ 19న అందిన గోప్య సమాచారంతో కేసు నమోదు చేసిన సీబీఐ, డిసెంబర్ 18న మధ్యవర్తి వినోద్ కుమార్ ద్వారా రూ.3 లక్షల లంచం అందినట్లు ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 23 వరకు సీబీఐ కస్టడీకి అనుమతి లభించింది.
సోదాల సమయంలో ఢిల్లీలోని శర్మ నివాసంలో నుంచి మొత్తం రూ.2.36 కోట్లకు పైగా నగదుతో పాటు పలు అభ్యంతరకర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.3 లక్షల లంచం మొత్తం కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. అలాగే శర్మ భార్య కాజల్ బాలి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.10 లక్షలు లభించాయి. కాజల్ బాలి ప్రస్తుతం శ్రీగంగానగర్‌లోని డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్ (DOU) కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో శర్మ కార్యాలయంతో పాటు సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిపై కఠిన చర్యలలో భాగంగానే ఈ దర్యాప్తు సాగుతోందని సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దర్యాప్తు పురోగతిని బట్టి మరిన్ని అరెస్టులు ఉండవచ్చని తెలుస్తోంది