సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలను చేస్తూ ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అవకాశం రావాలె కానీ, మంచి పాత్రల్లో కనిపించి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు. అలంటి వారిలో టాలీవుడ్లో మహానటితో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ ఒకరు. ఇప్పుడు ఈ టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ఆమె ‘రౌడీ జనార్దన్’ అనే సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
ఇప్పటివరకు హుందా అయిన పాత్రల్లో మాత్రమే కనిపించిన కీర్తి, ఇటువంటి బోల్డ్ రోల్ చేయడం అభిమానులకు షాక్ కలిగిస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు కీర్తి సురేష్ గానీ, సినిమా యూనిట్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సినిమా పరిశ్రమ వర్గాలు ఈ వార్తలను ప్రస్తుతం ఊహాగానాలుగా పరిగణిస్తున్నాయి. కానీ, నిప్పులేనిదే పొగరాదుగా అని కొందరు అంటున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్డమ్’ సినిమా షూటింగ్లో ఉన్నారు. దీని తరువాత ఆయన ‘రౌడీ జనార్దన్’ అనే చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి కోలా రవికిరణ్ దర్శకత్వం వహించనుండగా, దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపికయ్యిందన్న వార్తలు గత కొన్నాళ్లుగా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నా, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇటీవల మీడియా ఆమెను దీని గురించి ప్రశ్నించగా, "ఈ విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు చెబుతారు" అంటూ స్పందించడంతో, ఈ గాసిప్స్‌కు మరింత ఊతమొచ్చింది. సినిమాపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె పాత్ర బోల్డ్‌గా ఉంటుందన్న వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇక నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో మరో యువ నటి కయాదు లోహర్ కూడా వేశ్య పాత్రలో నటిస్తోందని మరో గాసిప్ తెరపైకి వచ్చింది. ఇది కూడా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
కీర్తి సురేష్ విషయానికి వస్తే గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘బేబీ జాన్’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా విఫలమైంది. ఆ షాక్ నుండి కోలుకుని, టాలీవుడ్ వైపు మళ్లిన ఆమె, ఇటీవల ‘ఉప్పు కప్పురంబు’ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె ‘రౌడీ జనార్దన్’ ద్వారా బిగ్ స్క్రీన్ మీద మళ్లీ సంచలనం సృష్టించాలనుకుంటుందన్న అంచనాలు వస్తున్నాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్తలపై అధికారిక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వేశ్య పాత్రలో కీర్తి కనిపిస్తుందా? లేక ఇవన్నీ ఫేక్ గాసిప్సా అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ రూమర్లతో సినిమాపై ఆసక్తి, చర్చ మాత్రం విపరీతంగా జరుగుతోంది.