జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ నగరంలో ఉన్న స్పార్కాస్సే బ్యాంక్లో భారీ దొంగతనం జరిగింది. క్రిస్మస్ సెలవుల సమయంలో గుర్తుతెలియని దొంగలు బ్యాంకు పార్కింగ్ గ్యారేజీ గోడను ఛేదించి ఖజానాలోకి ప్రవేశించి, వేలాది సేఫ్ డిపాజిట్ లాకర్లను పగలగొట్టారు. ఈ ఘటనలో నగదు, విలువైన ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, దొంగలు బ్యాంక్ భవనం కింద ఉన్న పార్కింగ్ గ్యారేజీ నుంచి ఖజానా వైపు పెద్ద రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. అనంతరం 3,250కి పైగా సేఫ్ డిపాజిట్ లాకర్లను తెరిచి, అందులో ఉన్న నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను తీసుకుని పారిపోయారు. మొత్తం దోపిడీ విలువపై ఇంకా స్పష్టత రాలేదని, అయితే నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
క్రిస్మస్ సెలవుల సమయంలో ఎక్కువ కార్యాలయాలు, దుకాణాలు మూసివుండటంతో, రాకపోకలు తక్కువగా ఉంటాయని భావించి నేరస్థులు ఈ సమయాన్ని ఎంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. డిసెంబర్ 29వ తేదీ ఉదయం బ్యాంకులో అగ్ని ప్రమాద హెచ్చరిక మోగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు, బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, గోడలో పెద్ద రంధ్రం కనిపించింది.
దర్యాప్తులో, ఈ దోపిడీ కోసం భారీ డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగించినట్లు తేలింది. ఇది ఒక్కరోజులో జరిగే పని కాదని, చాలా రోజుల పాటు పక్కా ప్రణాళికతో ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం మధ్యలో, ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు పెద్ద సంచులను మోసుకెళ్తున్నట్లు స్థానికులు చూశారని పోలీసులు తెలిపారు. అలాగే, నల్లటి రంగు ఆడి ఆర్ఎస్6 కారు సీసీటీవీ ఫుటేజీలో నమోదైనట్లు వెల్లడించారు.
ఈ దోపిడీని పోలీసులు హాలీవుడ్ చిత్రం “ఓషన్స్ ఎలెవెన్” తరహాలో ఉందని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద స్థాయిలో, అంత జాగ్రత్తగా వ్యవహరించడం సాధారణ దొంగలకు సాధ్యం కాదని, ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్ పని అయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా, స్పార్కాస్సే బ్యాంక్ యాజమాన్యం తమ కస్టమర్లకు అండగా ఉంటామని, నష్టపోయిన వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.