తెలంగాణ రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా విస్తార వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా జులై 18వ తేదీ సాయంత్రం నుండి మొదలైన వానలు నిలకడ లేకుండా కురుస్తూనే ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో అయితే కుండపోత వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో రహదారులు చెరువుల్లా మారిపోవడం, లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోవడం, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం మరోసారి ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాల హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం జూలై 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
వర్షాలకు కారణం – ద్రోణి ప్రభావం
దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున జూలై 23, 24 తేదీల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం
- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల,
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట,
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్,
- వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట ప్రాంతాల్లో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
- ఆదివారం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అత్యధికంగా 7.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజలకు సూచనలు
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురుస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్థంభాలు, నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అపత్తి పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ వర్షాల ధాటికి తడిసిముద్దవుతున్న ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడమే సురక్షిత మార్గం.