అనకాపల్లి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోగా, ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాదంతో ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర కలకలం నెలకొంది.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సుమారు 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టాటా–ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ నుంచి ఎలమంచిలి వైపు వెళ్తుండగా, ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీల నుంచి పొగలు రావడాన్ని గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై, ఎలమంచిలి సమీపంలోని ఒక పాయింట్ వద్ద రైలును నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
మంటలు చెలరేగడంతో బోగీల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగతో ఏం జరుగుతోందో అర్థంకాక, చాలామంది ప్రయాణికులు బోగీల నుంచి బయటకు దూకి స్టేషన్ వైపు పరుగులు తీశారు. ఈ హడావుడిలో కొందరు చిన్నపాటి గాయాలపాలయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు బయటకు రాలేకపోవడంతో సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు.
రైల్వే అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, నర్సింగబల్లి ప్రాంతంలో బీ1 ఏసీ బోగీకి బ్రేకులు పట్టేయడంతో వేడి పెరిగి మంటలు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పూర్తి కారణాలు దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని తెలిపారు. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది తీవ్ర శ్రమతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రైళ్లు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అనకాపల్లికి ఇప్పటికే నాలుగు గంటల ఆలస్యంగా చేరినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాదంలో రెండు బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దాదాపు రెండు వేల మంది ప్రయాణికులు అర్ధరాత్రి స్టేషన్లోనే ఉండిపోయారు. అంబులెన్స్‌లు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. అర్ధరాత్రి తర్వాత కాలిపోయిన బోగీలను తొలగించి, మిగిలిన బోగీల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి రైలును ముందుకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.