కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్‌లో ఆదివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఆమెతో కలిసి కల్వరి-క్లాస్ జలాంతర్గామి INS వాగ్షీర్లో ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రపతి ముర్ము నావికాదళ యూనిఫాం ధరించి జలాంతర్గామి వద్దకు చేరుకున్నారు. నావికాదళ అధికారులు ఆమెకు జలాంతర్గామి నిర్మాణం, పనితీరు, భద్రతా వ్యవస్థలపై వివరాలు అందించారు. కల్వరి-క్లాస్ జలాంతర్గామిలో రాష్ట్రపతి చేసిన మొదటి ప్రయాణం ఇదే. అంతేకాదు, భారతదేశ చరిత్రలో జలాంతర్గామిలో ప్రయాణించిన రెండవ రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. అంతకు ముందు 2006 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జలాంతర్గామిలో ప్రయాణించారు.
INS వాగ్షీర్ P75 స్కార్పీన్ ప్రాజెక్ట్‌లోని ఆరవ మరియు చివరి జలాంతర్గామి. ఇది ఈ ఏడాది జనవరిలో భారత నావికాదళంలోకి అధికారికంగా చేరింది. ఆధునిక సాంకేతికత, అధిక దాడి సామర్థ్యం, సముద్రంలో దీర్ఘకాలం గోప్యంగా పనిచేసే లక్షణాలు ఈ జలాంతర్గామికి ప్రత్యేకత. సముద్ర సరిహద్దుల రక్షణలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
రాష్ట్రపతి ముర్ము రక్షణ దళాల సామర్థ్యాన్ని తెలుసుకునే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. ఇదివరకే ఆమె భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాల్లో కూడా ప్రయాణించారు. అక్టోబర్ 29న అంబాలా వైమానిక దళ స్థావరం నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించారు. ఆ విమానాన్ని నడిపిన పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్. దీంతో రెండు రకాల యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతిగా ముర్ము గుర్తింపు పొందారు.
అంతకు ముందు, 2023 ఏప్రిల్ 7న అస్సాంలోని తేజ్‌పూర్ వైమానిక దళ కేంద్రం నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో కూడా ఆమె ప్రయాణించారు. సుఖోయ్ విమానంలో ప్రయాణించిన దేశ రెండవ మహిళా రాష్ట్రపతి కూడా ముర్మే. ఆమెకు ముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా సింగ్ పాటిల్ ఈ ఘనత సాధించారు.