హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో జరిగిన ఆర్థిక కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో ఈ రోజు నుంచి ఐదుగురు ప్రధాన నిందితులను సీఐడీ అధికారులు ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 21 వరకు సీఐడీ తమ అదుపులో ఉంచనుంది.
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ప్రెసిడెంట్ కవిత యాదవ్‌లపై ఈ విచారణ జరగనుంది. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, క్లబ్ సభ్యత్వాల్లో తలెత్తిన అవకతవకలు కీలక దృష్టిగా ఉంటాయని అధికారులు తెలిపారు.
సీఐడీ ఇప్పటికే తన విచారణలో నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు ‘శ్రీచక్ర క్రికెట్ క్లబ్’ను స్థాపించినట్లు, అలాగే గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడైన సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేల్చింది. ఈ నకిలీ పత్రాల ఆధారంగా HCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని అధికారులు వెల్లడించారు.
బీసీసీఐ నుంచి వచ్చిన కోట్ల రూపాయల నిధులను క్రికెట్ అభివృద్ధికి వినియోగించాల్సినవారే, అవి తమ ఖాతాల్లో వేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాల్సిన సంఘం ఇప్పుడు అవినీతికి ప్రతీకగా మారిపోయిందన్నది ఆటగాళ్ల నుంచి అభిమానుల వరకూ వినిపిస్తున్న వాదన.
కోర్టు నుంచి క్లియర్ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో సీఐడీ ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. రికార్డులు, సాక్ష్యాలను సేకరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణ క్రికెట్‌పై మచ్చ తెచ్చి.. క్రికెట్ అసోసియేషన్ పై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నంగా ఈ దర్యాప్తు మారాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. HCA పేరును మళ్లీ గౌరవించదగిన స్థానానికి తీసుకెళ్లే మార్గం ఇదే కావాలని ఆశిస్తున్నారు.