ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించుకున్న దారిలో ఒకటి స్వచ్ఛాంధ్ర సంకల్పం. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర సభలో సీఎం మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి శుభ్రత పెంచితేనే ఆరోగ్యవంతమైన సమాజం, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
"ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, అది మన ఆరోగ్యానికి హానికరం. అధికంగా ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది," అని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను అక్టోబర్ లోపల పూర్తిగా తొలగించే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, ఆలయ పరిసరాలను సిబ్బందితో కలిసి స్వయంగా శుభ్రం చేయడం విశేషం. అదేరోజు రేణిగుంటలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ చేపట్టిన పనులను సమీక్షించారు.
పర్యావరణ స్వచ్ఛతతోపాటుగా రాజకీయ శుభ్రత కూడా అవసరమని పేర్కొన్న సీఎం, "ఇంట్లో చెత్తను ఊడ్చినట్లే, నేర రాజకీయాలను కూడ ఊడ్చేయాలి. నేరస్తుల రాజకీయాల్లో స్థానం లేదు. ప్రజలకు నైతికతతో కూడిన నాయకత్వమే అవసరం" అంటూ ప్రజలకు సందేశమిచ్చారు.
స్వచ్ఛత, పారిశుధ్యం, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.