రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, చిన్నారుల రక్షణకు మరింత ప్రాధాన్యత కల్పించడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి సాధారణ జరిమానా కంటే రెట్టింపు జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది భద్రత పరంగా ప్రజలలో మరింత అవగాహన పెంపొందించడమే కాకుండా, పిల్లల జాగ్రత్తపై బాధ్యతను పెంపొందించనున్నదిగా అధికారులు పేర్కొంటున్నారు.
❖ మెరిట్ – డీమెరిట్ పాయింట్స్ సిస్టమ్
ఇది తోడు, డ్రైవర్ల ప్రవర్తన ఆధారంగా మెరిట్ (Merit), డీమెరిట్ (Demerit) పాయింట్ల వ్యవస్థను కూడా కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇది డ్రైవింగ్ లైసెన్స్‌కు అనుసంధానంగా ఉంటుంది. డ్రైవర్ నిబంధనలు సక్రమంగా పాటిస్తే మెరిట్ పాయింట్లు, ఉల్లంఘిస్తే డీమెరిట్ పాయింట్లు జమవుతాయి. డీమెరిట్ పాయింట్లు ఒక నిశ్చిత స్థాయికి చేరితే, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది వరుసగా నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులకు ఆంక్షలు విధించేందుకు కీలకంగా మారనుంది.
❖ జరిమానా ఎంత?
ఒక సాధారణ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు ₹1000 జరిమానా విధిస్తే, అదే ఉల్లంఘన పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు జరిగితే ₹2000 జరిమానా విధిస్తారు. పిల్లలు సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించడం, వేగం మించి వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అతిక్రమించడం వంటి చర్యలకు ఇదే వర్తించనుంది.
❖ వాహనదారులకు సూచనలు
ఈ కొత్త ప్రతిపాదనల నేపథ్యంలో డ్రైవర్లు, తల్లిదండ్రులు, స్కూల్ వాహనాలు నడుపేవారు మరింత బాధ్యతతో ప్రవర్తించాలని అధికారులు చెబుతున్నారు. పిల్లల భద్రతను ప్రాధాన్యతగా తీసుకొని ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
పిల్లల రక్షణను బలపరిచే ఈ చర్యలు మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి మీద, బేసిక్స్ పాటించని వారి మీద కూడా కఠిన చర్యలకు దారితీయనున్నాయి. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులే కాకుండా, సమాజ భద్రతకూ తోడ్పడవచ్చు.
ఇదే సమయంలో కేంద్రం తీసుకొచ్చే ఈ కొత్త విధానాలను అమలు చేసే విధానం, సాంకేతిక అమలు దశలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.