భారత సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే అరుదైనవని, అవతార్ వంటి సినిమాలకంటే రామాయణం, మహాభారతాలు ఎంతో గొప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ విజ్ఞానం, పురాణాలు, సంప్రదాయాల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశం వేల ఏళ్లుగా విజ్ఞాన భాండాగారంగా వెలుగొందుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. హరప్పా నాగరికత కాలంలోనే అద్భుతమైన పట్టణ ప్రణాళికను మన పూర్వీకులు ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తుచేశారు. ఆయుర్వేదం, యోగా వంటి వైద్య, ఆధ్యాత్మిక విధానాలు వేల ఏళ్ల క్రితమే భారత్ నుంచి ప్రపంచానికి వెళ్లాయని చెప్పారు. సుమారు 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం ప్రారంభమైందని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా 150కు పైగా దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు.
విజ్ఞానం, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం వంటి అనేక రంగాల్లో భారతీయులు చేసిన సేవలు అపారమని సీఎం పేర్కొన్నారు. ఆర్యభట్ట ఖగోళ శాస్త్రంలో, భాస్కరాచార్య గణితంలో, చరకుడు–ధన్వంతరి వైద్యంలో, కౌటిల్యుడు ఆర్థిక శాస్త్రంలో అందించిన జ్ఞానం ప్రపంచానికి దారి చూపిందన్నారు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ విద్యా చరిత్రలో భారత్కు విశిష్ట స్థానం కల్పించాయని తెలిపారు. సున్నా ఆవిష్కరణ, చదరంగం వంటి మేధోక్రీడలు భారతీయుల మేధస్సుకు నిదర్శనమని చెప్పారు.
నేటి పిల్లలు హాలీవుడ్ సూపర్ హీరోల వైపు ఆకర్షితులవుతున్నారని, కానీ మన పురాణాల్లో అంతకంటే గొప్ప వీరులు ఉన్నారని వారికి చెప్పాలని చంద్రబాబు సూచించారు. సూపర్ హీరోలకంటే హనుమంతుడి శక్తి, అర్జునుడి విలువిద్య, యుద్ధ కౌశలం ఎంతో గొప్పవని వివరించాలన్నారు. అవతార్ వంటి సినిమాలు ఊహాజనిత ప్రపంచాలను చూపిస్తే, రామాయణం, మహాభారతాలు జీవన సత్యాలతో నిండిన మహాకావ్యాలన్నారు.
ఈ సందర్భంగా దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. భారతీయ వారసత్వాన్ని గౌరవిస్తూ, దానిపై గర్వంతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.