Andhra Taxi: ఆటోలు, ట్యాక్సీల్లో అధిక ఛార్జీల సమస్యకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా ‘ఆంధ్రా ట్యాక్సీ’ అనే ప్రభుత్వ పోర్టల్, యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌ను విజయవాడ కేంద్రంగా, ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించనున్నారు. పర్యాటకులు, స్థానిక ప్రజలకు చౌకగా, సురక్షితంగా రవాణా సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.
విజయవాడ దుర్గ గుడి, భవానీ ద్వీపం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వచ్చే భక్తులు, సందర్శకుల నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు గత కొంతకాలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ ద్వారా ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆటో, క్యాబ్‌లను యాప్‌తో పాటు వాట్సప్, ఫోన్ కాల్, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని నమోదు చేస్తే, ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి. డ్రైవర్లను ముందుగానే అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించి, అర్హులైన వారికే అనుమతి ఇస్తారు. అలాగే రవాణా శాఖ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకే ఈ సేవలో అవకాశం కల్పిస్తారు.
మహిళల భద్రతకు పెద్దపీట వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి బుకింగ్‌కు సంబంధించిన వివరాలు, వాహనాల సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా యాప్‌ను రూపొందించారు. అంతేకాదు, యాప్‌లో నమోదైన డేటా మొత్తం రాష్ట్ర డేటా కేంద్రానికి అనుసంధానమవుతుంది. దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు రవాణా సేవలతో పాటు, హోటల్ గదుల బుకింగ్, పూర్తి పర్యాటక ప్యాకేజీల ఎంపిక కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. అదనంగా, రైతుల అవసరాల కోసం డ్రోన్ సేవలను కూడా భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ను త్వరలో ప్లే స్టోర్‌లో విడుదల చేస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.