భారత ఆర్మీ సైనికులకు ఐదేళ్ల విరామం తర్వాత సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించేందుకు పరిమిత అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా అన్ని ర్యాంకుల సైనికులకు వర్తించేలా కొత్త మార్గదర్శకాలను భారత ఆర్మీ జారీ చేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (X) వంటి యాప్‌ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించారు.
వార్తా సంస్థ ఏఎన్ఐ అందించిన వివరాల ప్రకారం, కొత్త మార్గదర్శకాల కింద సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫోటోలు, వీడియోలను చూడవచ్చు. అయితే వాటికి లైక్ చేయడం, కామెంట్ చేయడం పూర్తిగా నిషేధించారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లలో గోప్య సమాచారం కాని విషయాలను మాత్రమే పంచుకోవాలని సూచించారు. యూట్యూబ్, ఎక్స్ (మాజీ ట్విట్టర్)లను కేవలం సమాచార అవసరాల కోసమే వినియోగించాలి. అలాగే లింక్డ్ఇన్, స్కైప్, సిగ్నల్ వంటి యాప్‌లకు కూడా ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
2020లో సున్నితమైన సమాచార భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, జూమ్, పబ్జీ వంటి 89 యాప్‌లను సైనికులు వినియోగించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పట్లో సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ ఘటనలు పెరగడం, గోప్య సమాచారం లీక్ కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి కీలక సమాచారం చేరిన కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఆర్మీ వర్గాల ప్రకారం, సమాచార ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో సైన్యం పూర్తిగా సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడం, సమాచారాన్ని గమనించడం అవసరమని భావించి ఈ మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు విధించారు.
పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించి సరిహద్దు ప్రాంతాల్లో సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్మీ గతంలోనే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2024లో అధికారిక అవసరాల కోసం కూడా వాట్సాప్ వాడకాన్ని పరిమితం చేసి, అనంతరం పూర్తిగా నిషేధించారు. తాజా మార్గదర్శకాలతో వ్యక్తిగత వినియోగానికి మాత్రమే పరిమిత వెసులుబాటు కల్పించారు.
ఆర్మీ సైబర్ భద్రత విభాగం ఈ నిబంధనల అమలుపై నిరంతర నిఘా కొనసాగించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది