కొత్త మీటర్ పెట్టుకున్న మరుసటి రోజే రూ.1.70 లక్షల బిల్లు..! సోషల్ మీడియాలో వైరల్ వీడియో
కొత్తగా ఇంట్లో విద్యుత్ మీటర్ అమర్చిన తర్వాత సాధారణంగా దాదాపు 30 రోజుల తర్వాతే మొదటి బిల్లు వస్తుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి, తన ఇంట్లో కొత్తగా స్మార్ట్ మీటర్ అమర్చించిన మరుసటి రోజే రూ. 1.70 లక్షల విద్యుత్ బిల్లు వచ్చినట్లు చెబుతున్నాడు.
ఈ వీడియోలో అతను గోడపై అమర్చిన మీటర్‌ను చూపిస్తూ, “మీటర్ నిన్నే అమర్చారు. కానీ చూడండి... ఈరోజే బిల్లు వచ్చింది. అది కూడా రూ. 1,70,700" అని చెబుతాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న బిల్లును కెమెరాకు చూపిస్తూ, "ఇలాంటి బిల్లులు మీకు వస్తే మీరు ఏమి చేస్తారు?" అని ప్రశ్నిస్తున్నాడు. ఈ వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్టు చేయగానే, అది తెగ వైరల్ అయింది.
ఈ వీడియోపై నెటిజన్ల స్పందనలు విరివిగా వస్తున్నాయి. "ఇది టెక్నికల్ ఎర్రా అయుండొచ్చు", "మీటర్ పనిచేసే విధానంలో లోపం ఉందేమో", "ఇలా బిల్లులు వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి?" అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సరదాగా స్పందిస్తూ, "ఒకరోజు లోనే AC ఫ్యాక్టరీ నడిపించారా?" అనే రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో విద్యుత్ బిల్లులకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో ఫిర్యాదులు, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ ఈ వీడియోలో విషయం మాత్రం సాధారణ బిల్లింగ్ లోపం కంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం ఒక రోజులో రూ.1.70 లక్షల బిల్లు రావడం అనేది వినడానికి కూడా అసాధారణమే.
ఇటువంటి సమస్యలు వినిపిస్తుండటంతో, వినియోగదారులు తమ మీటర్లను తరచూ పరిశీలించుకోవడం, బిల్లింగ్‌లో ఏవైనా లోపాలుంటే తక్షణమే సంబంధిత డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడం అవసరం. లేదంటే చెల్లించలేని స్థాయిలో బిల్లులు రావడం, ఆపై వాటిని రద్దు చేయించుకోవడం వంటివి గందరగోళాన్ని సృష్టించవచ్చు.
ఈ వీడియో నిజంగా టెక్నికల్ లోపమా? లేక మరేదైనా కారణమా? అన్నది తెలుసుకోవాలి. కానీ దీనిపై విద్యుత్ శాఖ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
The electricity meter was installed just one day ago, and within a single day, a bill of Rs 170,000 was generated.
pic.twitter.com/oqfyQho5lp
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 15, 2025