దేశంలో మొట్టమొదటి అపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని విశాఖపట్నంలో రూ.750 కోట్ల బడ్జెట్తో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రకటనలు వచ్చాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో ఎయిమ్స్లా కార్యకలాపాలు జరుగుతాయి. 450 పడకలతో ప్రకృతి వైద్య ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాలు, శిక్షణా కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి.
గుంటూరులో CRIYN ప్రాజెక్టు ప్రకటన
ఇప్పుడు వైజాగ్ తో పాటు గుంటూరు జిల్లాలో యోగాకి సంబంధించి మరో కీలక సంస్థ రాబోతోంది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ సమాధానంగా గుంటూరు జిల్లా నడింపాలెంలో రూ.93.82 కోట్లతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) ఏర్పాటు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తారు, పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏపీ ప్రభుత్వం 15 ఎకరాల భూమి కేటాయించి, పరిపాలనా అనుమతులు పొందింది.
ఆయుష్ రంగంలో ఏపీకి అదనపు సహాయం
2025-26 బడ్జెట్లో ఏపీకి ఆయుష్ శాఖ రూ.165.65 కోట్లు కేటాయించింది, కేంద్రం 60:40 నిష్పత్తిలో మొదటి వాటా విడుదల చేసింది. ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కళాశాల, రాష్ట్రంలో యునాని వైద్య కళాశాలలు, ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులు సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.