వైసీపీ హయాంలో వరుసబెట్టి హిందుత్వ పై దాడులు
ఆలయాలు ధ్వంసం... రథం దగ్ధం.. ఆభరణాల చోరీ
సిట్ నివేదికలో వైసీపీకి ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు
మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశాలపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. సిట్ నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లు తామే అధికారంలో ఉంటామని.. రాజకీయ లబ్ది కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. భగవంతుడిపైనా వైసీపీ పగబట్టిందని ధ్వజమెత్తారు. అందరం ఏడు కొండలు అంటామని.. వైసీపీ వాళ్లు రెండు కొండలు అంటారని అన్నారు. వైసీపీ హయాంలో హిందూ మతంపై చాలా దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకొకటి కొందామన్నారని చెప్పుకొచ్చారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివారు చేశారని చెప్పారన్నారు. నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 'తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారు. సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్చిట్ ఇవ్వలేదన్నారు. రిపోర్ట జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. భగవంతుడితో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు తప్ప బతికున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలి. భగవంతుడికి మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టం. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరం. 2022లోనే కల్తీ నిర్ధారణ అయ్యింది. అయినా అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారు' అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో కళ్ల ముందు ఎన్నో వాస్తవాలు కనిపిస్తుంటే మాట్లాడకపోవటం సబబు కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 'అన్ని నివేదికలు.. ప్రసాదంలో వాడిన పదార్థాల్లో నెయ్యి లేదని నిర్ధారించాయి. ఎన్డీడీబీ జంతుకొవ్వు అవశేషాలు నిర్దారిస్తే, తమ వద్ద అలాంటి పరీక్ష చేసే సామర్థ్యం లేదని ఎన్టీఆర చెప్పింది. ప్రతీమాట భక్తుల మనోభావాలు, సెంటిమెంటును దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం. దేవుడి విషయాన్ని రాజకీయం చేయకూడదనే నిష్ఠతో వ్యవహరిస్తూ వస్తున్నాం. ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే నిజాలు బయటపెడుతున్నాం. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.