అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు
ఆ పార్టీ ట్రాప్ లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదు
లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయింది
అందుకే ఫ్రస్టేషన్ లో నానా యాగీ చేసే ప్రయత్నాలు
వైకాపా కుట్రలతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాల్సిందే
పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.
ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు.
ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలో హింసను ప్రేరేపించటానికి వైకాపా కుట్రలు పన్నుతోందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని.. అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైకాపా పుట్టింది. ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదని చంద్రబాబు అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయింది.. రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని చీదరించుకుంటున్నారు. చేసిన పాపాలను దారిమళ్లించాలనేది వైకాపా కుట్ర. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన అజెండా. అది వైకాపా నేతలకు నచ్చడం లేదు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతాం. తెదేపా కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలి. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైకాపా ట్రాప్ పడొద్దు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇకపోతే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, శాంతిభద్రతల అంశం, పాలనలో మార్పులు వంటి విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తాజా ట్వీట్ చర్చకు దారితీసింది. వైసీపీపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేక వైసీపీలో థ్రస్టేషన్ పెరిగిందని చంద్రబాబు విమర్శించారు. రాజకీయాలను నేరమయం చేయడమే వైసీపీ. సిద్దాంతమని, వారి పాలనలో చట్టవిరుద్ధ పాలనకు అనేక ఉదాహరణలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జగన్ హయాంలో చట్టాన్ని పక్కనపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన అనేక అక్రమాలు, చట్టవిరుద్ధ చర్యలే దీనికి నిదర్శనమని ప్రస్తావించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ జగన్ పాలన కొనసాగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు తన ట్వీట్లో రూల్ ఆఫ్ లా గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 2024 తర్వాతే రాష్ట్రంలో నిజమైన చట్టపాలన అమలవుతోందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో చట్టం పేరుకే ఉండేదని అధికారమే అన్నింటికీ ఆధారంగా మారిందని విమర్శించారు. ప్రజలకు న్యాయం అందాలంటే రాజ్యాంగమే సుప్రీమ్‌గా ఉండాలని, అదే తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదని, అది ఏ పార్టీకి చెందిన వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని చంద్రబాబు అభివర్ణించారు. గతంలో క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించామన్నారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. శాంతిభద్రతలను ఉ ల్లంఘించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పునర్నిర్మాణ పక్రియను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని సీఎం విమర్శించారు. వారు విధ్వంసం చేసిన వ్యవస్థలను మళ్లీ నిర్మిస్తున్న తీరును చూసి అసహనంతో దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేయడం, వారికి సాధికారిత కల్పించడమే తమ ప్రభుత్వ సిద్దాంతమని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయటం, వారికి సాధికారిత కల్పించటమే తమ ప్రభుత్వ సిద్దాంతమని తెలిపారు. పాలనలో పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతాయుత పాలన తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. వైసీపీ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతోనే ఆ పార్టీ నాయకులు అసహనంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.