భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ
రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు అబద్ధం
క్రెడిబులిటీ ఉన్న ఐదు సంస్థలకే 99 పైసల చొప్పున కేటాయింపు
విపక్ష సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి లోకేశ్
అమరావతి : రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైకాపా కుట్రలు చేసిందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైకాపా సభ్యులు చేసిన ఆరోపణలను మంత్రి లోకేశ్ తిప్పికొట్టారు. క్రెడిబులిటీ ఉన్న ఐదు సంస్థలకే 99 పైసల చొప్పున భూములు కేటాయించామని.. ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోమని లోకేశ్ చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే 18 నెలల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు రానుందని.. దీనికి భూములు కేటాయించామని మంత్రి లోకేశ్ అన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇవ్వడం తప్పా? అని నిలదీశారు. వైకాపా పాలనలో విశాఖకు కనీసం ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మండలిలో భూ కేటాయింపులపై వాడివేడి చర్చ నడుస్తోంది. కంపెనీలకు 99 పైసలకు ఎకరం భూములిచ్చారనే అంశంపై వాగ్వాదం నడిచింది. భూములిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని గతంలోనే ఛాలెంజ్ చేశానని, వాళ్లు ఆధారాలు తీసుకురాలేకపోయారని మంత్రి లోకేష్ అన్నారు. క్రెడిబులిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇస్తున్నాం అని లోకేష్ స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు? అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రహేజా రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదని మంత్రి అచ్చెన్నాయుడు బదులిచ్చారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ? 'విశాఖను ఐటీ క్యాపిటల్‌గా చేయాలని ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నాం. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఐటీ రంగంలో ఐదు కంపెనీలలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దేశంలో నే 23.5శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి' అని అన్నారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 'వైజాగ్ లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019 వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. గీతంకి భూములు కేటాయింపుపై వాక్ ఔట్ చేస్తున్నాం' అని అన్నారు. భూ కేటాయింపుల ప్రశ్నకు ప్రభుత్వ సమాధానానికి నిరసనగా ఆ ప్రశ్న నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. శాసనమండలిలో 99 పైసలుకు పరిశ్రమలకు భూములు కేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వానికి ప్రశ్న వేయగా.. ఐదు కంపెనీలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. 'గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలుకే భూములిచ్చారు. విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడులకు రూ.600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లూలు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు. రూ.3 వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలుకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుక్కోలేవా. 5 వేల కోట్ల విలువైన భూములను విశాఖలోని ఓ విద్యాసంస్థ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెప్తోంది. వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించొచ్చా?' అని ఎమ్మెల్సీ మాధవరావు అడిగారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ? 'ఎంవోయూలన్నీ క్లారిటీగా ఉన్నాయి. 99 పైసలుకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. కాగ్నిజెంట్, టాటా కన్జలెన్సీ సర్వీసెస్, ఏఎన్ఎస్సార్ గ్లోబల్, రహేజా, మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ కు 99 పైసలుకే భూములిచ్చాం. హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్‌లో లక్ష మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రహేజా గ్లోబల్ బిల్డ్ కాపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. రహేజా వాళ్ళు లక్ష ఎకరాల్లో నిర్మాణాలు చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకు ఇస్తారు. మేము పారదర్శకంగానే వాళ్లకు భూములు ఇస్తున్నాం. దానివల్ల వాళ్లు చేసిన నిర్మాణాల్లో పెద్ద ఎంఎన్సీ కంపెనీలకు ఇచ్చాం తప్ప అయానా.. గయానా కంపెనీలకు ఇవ్వలేదు' అని బదులిచ్చారు.