నీటి భద్రతలో రైతులు భాగస్వామ్యం కావాలి
నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలి
గతంలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు చేపట్టాం
మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తున్నాం
'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత'లో సీఎం చంద్రబాబు
మావిగన్ పేరుతో అమరావతిని అడ్డుకునే కుట్రలు అంటూ విమర్శలు
అనంతపురం : బ్యాంక్ లో నగదు దాచుకున్నట్లు మనం నీటిని భూమిలో దాచుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని సీఎం చంద్రబాబు కోరారు. భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో చంద్రబాబు పర్యటించారు. 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సమావేశమయ్యారు. వర్షపు నీటి విలువ రాయలసీమ రైతులకు బాగా తెలుసని అన్నారు. నీటిని సంరక్షించుకోవడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని స్పష్టం చేశారు. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి.. నిలబడిన నీటిని నిల్వ చేయాలి.. జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం వంటివి గతంలో చేపట్టామని చంద్రబాబు వివరించారు. నీటి కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని ఏపీ సీఎం గుర్తు చేశారు. నీటి భద్రతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రైతులు, సాగునీటి సంఘాలకు సూచించారు. మైక్రో ఇరిగేషన్లో తాము చేసింది.. దేశం మొత్తం అనుసరించిం దని అన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. గతంలోనే ఇంకుడుగుంతలు, వంటకుంటలు తవ్వించాం. ఎన్టీఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు ప్రగతి తీసుకువచ్చాం. మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాం. రాయలసీమలో 63 శాతం పంటలను మైక్రో ఇరిగేషన్ కిందికి తీసుకొచ్చాం. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌గా తయారైంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి. నీటిని నిల్వ చేసుకుంటే చాలు.. అదే సంపద సృష్టిస్తుందని చంద్రబాబు అన్నారు. గత ఏడాది వేసవి ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే.. ప్రస్తుతం అవి 11 మీటర్లే ఉన్నాయని తెలిపారు. వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతు, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా నీరు చూడాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అలా చేయగలిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉ ండదన్నారు. రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు నీరు అవసరమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు 28, తాగు నీటికి 158 టీఎంసీల చొప్పున మొత్తంగా 1,300 టీఎంసీల వరకూ మనకు అవసరం అవుతాయని వివరించారు. ఈ ఏడాదిలో 74 టీఎంసీల నీరు అనంతపురం వరకూ తీసుకు వచ్చామని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు మనకు అడ్రస్ లేకుండా చేశారంటూ వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని.. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం అని పేర్కొన్నారు.మావిగన్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైకాపాపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. వారికి మావిగన్ పిచ్చి ముదిరిందని మండిపడ్డారు.రాష్ట్రంపై పగబట్టారు.. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతి దేవతల రాజధాని.. పేరు పలికితే పుణ్యం వస్తుంది. అమరావతి పేరు పలకడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండండి. రాష్ట్రానికి ఒకే రాజధాని.. అది అమరావతి అని సీఎం స్పష్టం చేశారు. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు రాజధాని అమరావతికి మద్దతు పలికాయని సీఎం చంద్రబాబు వివరించారు. ఒక్క దిక్కు మాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి ముదిరి మావిగన్ అనే పేరు తెరపైకి తెచ్చారని వైసీపీ అధినేతపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని అమరావతి అని పలకడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు మావిగన్ అంటున్నారని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. బాబాయిని చంపి తన చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారంటూ వైసీపీ నేతల వైఖరిని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎండగట్టారు. రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. అవి చూసి సహించలేకే ఈ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉ ద్యోగాలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేతల తీరుపై ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జలధారతో ప్రతి ఎకరానికీ జలహారతి ఇచ్చేలా కార్యాచరణ చేపడదామని ప్రజలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, స్థానిక నేతలు పాల్గొన్నారు.