ఈ నెల 19న తొలి మ్యాచ్.. 27న ఫైనల్
మంగళగిరి వేదికగా డే, నైట్ మ్యాచ్‌లు.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం
బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్
విజయవాడ స్పోర్ట్స్ : మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న డబ్ల్యూఏపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న తొలి మ్యాచ్ ప్రారంభం కాగా, 27న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌కు అంతరాయం ఏర్పడితే రిజర్వ్ డేలో మ్యాచ్ నిర్వహించనున్నారు. మంగళగిరి వేదికగా జరిగే లీగ్ ఫైనల్లో కలిపి మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు జట్లు లీగ్ దశలో తలపడనున్నాయి. మహిళా క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించేలా ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లీగ్‌కు భారత మాజీ కెప్టెన్, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఆమె భాగస్వామ్యం మహిళా క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. డబ్ల్యూఏపీఎల్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ సానా సతీష్ బాబు, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మ్యాచ్‌ల నిర్వహణ, క్రీడాకారిణులకు సౌకర్యాలు, ప్రేక్షకుల కోసం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఏసీఏ ప్రతినిధులు తెలిపారు.