స్కానింగ్ కేంద్రాల్లో అక్రమ పరీక్షలకు తావులేకుండా తనిఖీలు
ఆడపిల్లల జనన నిష్పత్తి పెంపునకు అవగాహన కార్యక్రమాలు
డీఎంహెచ్ వో డాక్టర్ అచ్యుత కుమారి
అనకాపల్లి : జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం--1994ను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అచ్యుత కుమారి సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు ఎలాంటి అవకాశం లేకుండా స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శు క్రవారం ఆమె తన చాంబర్ లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 'ఆడపిల్లను కాపాడండి' అనే అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆడపిల్లల జనన నిష్పత్తిని పెంచి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నరైన వివాహ వయస్సు, యుక్త వయస్సులో గర్భధారణ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలు పాటిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే రాష్ట్ర టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447కు తెలియజేయాలని కోరారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.