వైసీపీ దుష్ప్రచారం కట్టిపెట్టాలి
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు
ఆధారాలు చూపాలని సవాల్
విజయవాడ : డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు సైతం నియామకాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. క్రీడా కోటా నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని, అభ్యర్థుల ఎంపికలో ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన వంటి ప్రక్రియలు ఉ ంటాయని తెలిపారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించి సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, వారంతా ఇప్పటికే విధుల్లో ఉన్నారని చెప్పారు. తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు డీఎస్సీపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశంతోనేనని విమర్శించారు. ఏపీపీఎస్సీ, గ్రూప్-1కు సంబంధించిన అంశాల పై విచారణ కొనసాగుతోందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని నవాల్ చేశారని, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆ నవాల్ను స్వీకరించి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కోరారు. అనంతరం వేముల రామకృష్ణ మాట్లాడుతూ తనపై రాధిక అనే మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షలో తనకు 104 మార్కులు మాత్రమే వచ్చాయని, తనకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాలేదని తెలిపారు. తాను రూ.15 లక్షలు చెల్లించి డీఎస్సీ ఉద్యోగం పొందానంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ప్రస్తుతం తాను ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానని రామకృష్ణ తెలిపారు.