నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వృషకర్మ' విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటం, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో ఎసిసిసి పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పురాణ గాథల నేపథ్యంతో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో నాగ చైతన్య మునుపెన్నడూ చూడని విభిన్నమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయింది. ఇందులో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు స్పర్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ఆయన మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 'కాంతార', 'విరూపాక్ష' చిత్రాలతో సంచలనం సృష్టించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రాగుల్ డి హేరియన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమా విజువల్స్ అత్యద్భుతంగా ఉండబోతున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, బిహైండ్-ది-సీన్స్ వీడియోలు సినిమాలోని ప్రత్యేకమైన ప్రపంచాన్ని విజువల్ గ్రాండియర్‌ను పరిచయం చేశాయి. తాజాగా రిలీజ్ డేట్‌ను లాక్ చేయడంతో, దేశీయంగానే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విభిన్నమైన కథాంశంతో, భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక బృందంతో వస్తున్న 'వృషకర్మ' నాగ చైతన్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.