ఆశావాద జీవితంతో అడుగులు వేస్తున్నా
కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతా
దావోస్లో అంతర్జాతీయ మీడియాతో చంద్రబాబు
దావోస్: భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఆశావాదినని అంటూ.. ముందుచూపుతో వ్యవహరించి.. వినూత్నంగా ఆలోచించి.. చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని ఉద్ఘాటించారు. దావోస్లో మూడో రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించారు. మాది పరిశ్రమల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులిస్తున్నాం. పరిశ్రమలకు ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని అమలు చేస్తున్నాం. అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం. విశాఖకు గూగుల్ కంపెనీ రాక ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలో అప్ వల్లే ఆ పెట్టుబడి సాధించగలిగాం. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపీలో ఉ త్పత్తికి అడుగులు వేస్తున్నాం. విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. 30 ఏళ్ల కిందటే దేశ అభివృద్ధిలో కీలక అడుగులు పడ్డాయి. ఇప్పుడు సంస్కరణలను అందిపుచ్చు కుంటున్నాం. అవే రాష్ట్రంలోని యువతకు అవకాశాలు కల్పించాయి. టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నాం. ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. ఏపీ అమలు చేస్తున్న విధానాలను, ఆలోచనలను, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ఆ స్థాయిలోనే పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుకుంటోంది. చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారత్కు లేదు. సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ భారత్ అదనపు బలం అని చంద్రబాబు అన్నారు.