విశాఖపట్నం క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల హంగామాతో వైజాగ్ నగరంలో సందడి వాతావరణం నెలకొననుంది. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలో విశాఖ వాసులు వరుసగా నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించే సువర్ణావకాశం దక్కించుకోనున్నారు.
ఇటీవల మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లను చూసి క్రికెట్ మజాను ఆస్వాదించిన వైజాగ్ అభిమానులు, ఇప్పుడు పురుషుల, మహిళల క్రికెట్ జట్ల మ్యాచ్‌లతో మరోసారి క్రికెట్ ఉత్సాహంలో మునిగి తేలనున్నారు. ఈ అన్ని మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌ల పూర్తి వివరాలు
విశాఖపట్నంలో జరగనున్న ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది..
1. భారత్ vs దక్షిణాఫ్రికా (పురుషుల వన్డే)
ప్రస్తుతం భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, మూడో వన్డే మ్యాచ్‌కి విశాఖపట్నం వేదిక కానుంది.
2. భారత్ vs శ్రీలంక (మహిళల టీ20 సిరీస్)
పురుషుల మ్యాచ్ అనంతరం, భారత మహిళల క్రికెట్ జట్టు ఇక్కడ అడుగుపెట్టనుంది. భారత్, శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు వైజాగ్‌లోనే జరగనున్నాయి.
3. భారత్ vs న్యూజిలాండ్ (పురుషుల టీ20)
డిసెంబర్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత, కొత్త సంవత్సరంలో జనవరి నెలలో మరోసారి టీమిండియా వైజాగ్‌కు రానుంది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ విశాఖలో జరగనుంది.
ఈ వరుస అంతర్జాతీయ మ్యాచ్‌లు విశాఖపట్నం క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలవనున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ అద్భుతమైన మ్యాచులను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమవుతున్నారు.