ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాగుందన్న అభిప్రాయం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో... పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఉస్తాద్ భగత్సాంగ్'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ 'పవన్ కల్యాణ్ అభిమానులు ఫోన్ చేసి 'అన్నా సినిమా చాలా బాగుంది' అంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా సినిమాని మలిచాం. తొలి రోజు నుంచీ ఓ కమర్షియల్ సినిమా తీస్తున్నానని, ఒకప్పటిలా హుషారైన పవన్ కల్యాణ్ ఇందులో కనిపిస్తారని చెబుతూ వచ్చా. సినిమా చూసినవాళు ఈ సినిమాలో ఇన్ని అంశాలు ఉన్నాయని మాకు తెలియదంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులోని ప్రతి పాత్ర బాగా పండింది. అందరికృషితోనే ఇంత మంచి సినిమా చేయగలిగాం అన్నారు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రేక్షకులు సినిమాని ఆస్వాదిస్తున్నారు. మేం ఊహించిన దానికంటే మంచి స్పందన వచ్చింది. పవన్ కల్యాణ్ వన్ మేన్ షో ఇది. హరీశ్ శంకర్ ఎంతో బాధ్యతగా 'గబ్బర్‌సింగ్' సినిమాని మించేలా తెరకెక్కించారు. కచ్చితంగా భారీ వసూళ్లు సాధిస్తుందీ చిత్రం' అన్నారు. నిర్మాత రవిశంకర్.వై మాట్లాడుతూ 'పెద్ద హీరో నుంచి వాణిజ్య ప్రధానమైన సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇందులో కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలూ ఉన్నాయి. మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా విజయంపై మేం సంతోషంగా ఉన్నాం' అన్నారు. ఈ కార్యక్రమంలో కళా దర్శకుడు ఆనంద్‌సాయి, గీత రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు.