కంపెనీ పునర్వ్యవస్థీకరణే కారణమన్న సీఈవో.. 30 వేలకు వడిపోనున్న ఉద్యోగుల సంఖ్య
ప్రముఖ అంతర్జాతీయ క్యాబ్ సేవల దిగ్గజం 'ఉబర్ టెక్నాలజీస్' తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. ఈ మేరకు సంస్థ సీఈవో దారా భోస్రోషాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా అధికారిక సమాచారం అందించారు. సంస్థలో నిర్వహణ స్థాయిలను తగ్గించి, పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో వెల్లడించారు. ఇటీవలి కాలంలో అనవసరమైన విభాగాలు, అదనపు మేనేజ్మెంట్ స్థాయిలు పెరిగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రైడ్ షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ వంటి కీలక వ్యాపార విభాగాల్లో పెట్టుబడులను సమీక్షించనున్నట్లు వివరించారు. ఈ లేఆఫ్ ప్రభావం 20 శాతం మంది మేనేజర్లతో పాటు, ఇతర స్థాయిల సిబ్బంది పై కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉ ద్యోగుల తొలగింపుతో పాటు, ఉబర్ తన రిమోట్ వర్క్ విధానానికి దాదాపు స్వస్తి పలికింది. భవిష్యత్తులో కేవలం ఒక శాతం మంది ఉద్యోగులకు మాత్రమే ఇంటి నుండి పనిచేసే అనుమతి ఉంటుందని, మిగిలిన వారంతా తప్పనిసరిగా కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ లేఆఫ్ అనంతరం ఉబర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 30 వేలకు పరిమితం కానుంది. తద్వారా సంస్థ సిబ్బంది సంఖ్య తిరిగి 2021 నాటి స్థాయికి చేరుకోనుంది.