అక్రమాలు అవాస్తవం
నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటా
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం
అధికారిక సంస్థలిచ్చిన పత్రాలే పరిగణనలోకి
ఫిర్యాదులుంటే విచారణ జరుపుతాం
స్కూళ్లకెళ్లి టీచర్లను అవమానించొద్దు
అలా చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు
విద్యా శాఖ కమిషనర్, శాప్ ఎండీ హెచ్చరిక ఆరోపణలపై కేస్ స్టడీస్ వివరాలు వెల్లడి
అమరావతి, మెగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల టెట్ అర్హతలు, క్రీడా సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణపై వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ వైస్ చైర్మన్/ఎండీ భరణి స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన టీచర్ల అర్హతలపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని, ఇందుకోసం రాష్ట్ర విద్యా శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకానీ ఎవరైనా నేరుగా పాఠశాలలకు వెళ్లి టీచర్ల గురించి అవమానకరంగా మాట్లాడితే కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలు, పాటించిన నిబంధనలను తెలియజేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అభ్యర్ధుల గురించి తమ విచారణలో వెల్లడైన కేస్ స్టడీస్ నన్ను వివరించారు.
పారదర్శకంగా ప్రక్రియ: అన్సారియా
మెగా డీఎస్సీ-2025లో టీచర్ ఉద్యోగం పొందిన అభ్యర్ధుల టెట్, విద్యార్హతలు, కేటగిరీలు, రిజర్వేషన్లు, క్రీడా అర్హత సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించామని విద్యా శాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా చెప్పారు. అభ్యర్థులు పొందుపర్చిన ఏవైనా సర్టిఫికెట్లు నకిలీవని లేదా అర్హతలకు విరుద్దమని నిర్ధారణ అయితే చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం ఆరోపణల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రతి కేసును అధికారికంగా తగిన ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని తెలిపారు. టీచర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల మేరకే జరిగినట్లు స్పష్టం చేశారు. పారదర్శకత, నిబంధనల అమలు, అధికారిక ఆధారాల పరిశీలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని వివరించారు.
రికార్డుల ప్రకారమే క్రీడా కోటా: భరణి
క్రీడా కోటా అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలపై శాప్ వైస్ చైర్మన్/ఎండీ భరణి వివరణ ఇస్తూ.. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు తాత్కాలిక జాబితాను ప్రచురించి గ్రీవెన్స్‌కు అవకాశం కల్పించామని చెప్పారు. వీటిపై తర్వాత వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించామన్నారు. స్పోర్ట్స్ కోటాపై హైకోర్టులో 69 రాతపూర్వక పిటిషన్లు దాఖలయ్యాయని, ఏపీ స్టేట్ జూడో అసోసియేషన్ జారీ చేసిన సర్టిఫికెట్ల ప్రామాణికతపై కోర్టులో పిల్ నంబర్ 170 ద్వారా పరిశీలనలో ఉందని తెలిపారు. 2017 నుంచి విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందినట్లు పిల్లో పేర్కొన్నారని తెలిపారు. విజిలెన్స్ విచారణ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించిందని, అందువల్ల ఈ అంశంపై తుది నిర్ణయం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రీడా కోటాలో క్రీడాకారులకు అధికారిక సంస్థలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. జాతీయ స్థాయి పోటీలకు సంబంధించి జాతీయ ఫెడరేషన్లు లేదా రాష్ట్ర అసోసియేషన్లు, ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు సంబంధిత వర్సిటీలు, స్కూల్ గేమ్స్క విద్యా(క్రీడా అధికారి, కేలో ఇండియా గేమ్సు స్పోర్ట్స్ అథారిటీకి ధ్రువీకరణలు జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. ఆ ప్రకారమే సర్టిఫికెట్లను టీచర్ల నియామక ప్రక్రియలో పరిశీలిస్తారని వివరించారు. ఒకే మండలానికి చెందిన ఏడుగురు క్రీడాకారుల జూడో సర్టిఫికెట్లపై ఆరోపణలు వచ్చాయని, వాటిపై విజిలెన్స్ విచారణ సాగుతోందని తెలిపారు. విచారణలో తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఒక క్రీడాకారుడు తన సొంత జిల్లాలో తప్పనిసరిగా పోటీలో పాల్గొనాలనే నిబంధన లేదని ఏపీ జూడో అసోసియేషన్ స్పష్టం చేసిందని చెప్పారు. క్రీడాకారులు తాము చదువుతున్న, పనిచేస్తున్న జిల్లాకు ప్రాతినిధ్యం వహించవచ్చని అసోసియేషన్ తేల్చిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల కేస్ స్టడీస్‌ను ఆమె వివరించారు.