రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్‌తో పాటు బస్సులోని 19 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. టిప్పర్ లారీ బస్సు కుడి వైపు భాగాన్ని పూర్తిగా దెబ్బతీయడంతో, ఆ వైపున కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్‌లో దాదాపు 15–20 టన్నుల కంకర ఉండటంతో అది పూర్తిగా బస్సుపై పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రాణాపాయం నుంచి బయటపడిన కొంతమంది ప్రయాణికులను పోలీసులు, స్థానికులు జేసీబీల సహాయంతో కంకర తొలగించి రక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ స్పందన
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాలని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు నిరంతరం తనకు తెలియజేయాలని అధికారులను సీఎం సూచించారు.