భోగాపురం వద్ద ట్యాంకర్‌ను ఢీకొన్న ధార్..
ఐదుగురు మృతి శ్రీముఖలింగేశ్వరుని దర్శనం
ముగించుకుని వస్తుండగా ప్రమాదం
అగి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొట్టడంతో జీపులో మంటలు
మృతులంతా విశాఖ జిల్లాకు చెందిన వారే మృతుల్లో ఇద్దరు దంపతులు..
పెళ్లిరోజే సతీశ్, శ్రుతి మృతి పిల్లలతో ఫోన్లో మాట్లాడిన కొద్ది సేపటికే విషాదం
భోగాపురం, : కార్తీక పౌర్ణమి వేళ దైవదర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమైన ఐదుగురు స్నేహితుల కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న ట్యాంకర్ లారీని మహీంద్రా థార్ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారంతా విశాఖ జిల్లాకు చెందినవారే. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖకు చెందిన కొండపు సూరిబాబు, వాకలపూడి శ్రీను, కుసుమ రజని, బొర్రా సతీశ్, శ్రుతి కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వీరంతా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయాన్ని దర్శించుకుని థార్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. భోగాపురం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్యాంకర్ లారీని వేగంగా వచ్చిన థార్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో జీపు ముందు భాగం లారీ కిందకు చొచ్చుకుపోయి మంటలు చెలరేగాయి. వాహనంలో చిక్కుకున్న సూరిబాబు, శ్రీను, రజని అక్కడికక్కడే మృతిచెందగా, శ్రుతి కూడా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
పెళ్లిరోజే పెను విషాదం
బొర్రా సతీశ్, శ్రుతి దంపతులకు మంగళవారమే పెళ్లిరోజు కావడం విషాదాన్ని మరింత పెంచింది. సంతోషంగా ఆలయ దర్శనానికి వెళ్లిన ఆ దంపతులు అదే రోజు మృత్యువాత పడ్డారు. వాకలపూడి శ్రీను దంపతులకు ఇద్దరు పిల్లలు, సతీశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సూరిబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసిన కుమార్తె భవ్యశ్రీ కన్నీరుమున్నీరైంది.
పిల్లలతో చివరి ఫోన్ సంభాషణ
తిరుగు ప్రయాణంలో పిల్లలు ఫోన్ చేసి ఎక్కడున్నారని, ఎప్పుడు ఇంటికి వస్తారని అడగగా మరికాసేపట్లో చేరుకుంటామని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. అంతలోనే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆలయ దర్శనం అనంతరం దిగిన ఫొటోలు, పంపిన సందేశాలే ఇప్పుడు వారి కుటుంబాలకు జ్ఞాపకాలుగా మిగిలాయి.
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
థార్ వాహనం ట్యాంకర్‌ను ఢీకొట్టడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సెల్‌ఫోన్ పేలుడు శబ్దం వల్ల డ్రైవర్ అప్రమత్తత కోల్పోయాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అధిక వేగంతో ప్రయాణించిందా, రాత్రంతా ప్రయాణించడంతో డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చిందా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో జీపు వేగం గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భారీ క్రేన్ సాయంతో లారీ కింద చిక్కుకున్న జీపును బయటకు తీయించారు. మృతదేహాలను విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.