88,624 కోట్ల పెట్టుబడులు.. 54,419 మందికి ఉపాధి
24వ ఎస్ఐపీబీ సమావేశంలో 17 ప్రతిపాదనలకు ఆమోదం
పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ తదితర రంగాల్లో పెట్టుబడులు
19 వేల కోట్లతో కియా కంపెనీ విస్తరణకు సిద్ధం ఉత్తరాంధ్రలో
మరో భారీ డేటా సెంటర్ 200 ఎకరాల్లో రూ.4,709 కోట్లతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు
అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన 24వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో భారీ ప్రతిపాదనలకు అమోదం లభించింది. మొత్తం రూ.88,624 కోట్లకు పైగా పెట్టుబడులతో 17 ప్రాజెక్టుల ద్వారా 54,419 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలను సమావేశం ఆమోదించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి రూ.32.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా 1,017 ప్రాజెక్టులతో 22.7 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది. భాగస్వామ్య సదస్సు-2026లో మరో రూ.9.9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికే రూ.7.30 లక్షల కోట్ల పెట్టుబడులతో 303 ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరుకోగా, 7.76 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
కియా విస్తరణకు భారీ పెట్టుబడి
తాజా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదనల్లో కియా కంపెనీ విస్తరణ కీలకమైనది. శ్రీసత్యసాయి జిల్లాలో ఇప్పటికే కార్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్న కియా సంస్థ మరో రూ.19 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 12 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఉత్తరాంధ్రకు డేటా సెంటర్
ఉత్తరాంధ్రలో మరో భారీ పెట్టుబడితో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. అనకాపల్లి జిల్లా తూటిపాల పరిధిలో 200 ఎకరాల్లో రూ.4,709 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ, డేటా సెంటర్లు, రక్షణ రంగం, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో వచ్చిన ప్రతిపాదనలకు రానున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించనుంది.