కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి, పలువురు భక్తులు గాయాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామి దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఆలయ ప్రాంగణంలో భారీ రద్దీ కారణంగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ బృందాలు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను బాగా కలచివేసిందని, భక్తుల మరణం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే విషయంపై హోం శాఖ మంత్రి అనిత స్పందిస్తూ, ఆలయం మొదటి అంతస్తులో ఉందని, ఆ అంతస్తుకు చేరడానికి సుమారు 20 మెట్లు ఎక్కాల్సి ఉంటుందని తెలిపారు. ఆ క్రమంలో మెట్ల రెయిలింగ్ ఊడి పడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
ఈ ఘటనతో ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. కార్తీకమాసం పర్వదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భంలో జరిగిన ఈ దుర్ఘటన శ్రీకాకుళం జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికార యంత్రాంగం తక్షణ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.
ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.