రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని... ఈ విషయంలో గిరిజన ప్రజలు ఎటువంటి ఆందోళనకు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులుతో సచివాలయంలో సోమవారం సమీక్ష చేశారు. జీవో నెంబర్ 3 పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై గిరిజన ప్రజల ఆకాంక్షలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ "ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకువచ్చాం. దీని ద్వారా షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్ లు దక్కేలా చూశాం. దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉన్న ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నాటి ప్రభుత్వం ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించకపోకవడం వల్ల సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22న కొట్టేసింది. దీంతో రెండు దశాబ్దాల పాటు గిరిజనులు పొందిన ప్రయోజనాలు కొనసాగించే వీలు లేకుండా పోయింది. నాటి ప్రభుత్వం ఈ సమస్యపై కనీసం స్పందించలేదు. జీవో నెంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు 5గురు సభ్యుల ధర్మాసనం స్పష్టమైన తీర్పు నేపథ్యంలో ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం అని అన్నారు. త్వరలో గిరిజన సంఘాలతో చర్చలుస్థానికులకే ఉద్యోగాలు అంశంతో పాటు... గిరిజనులకు సంబంధించి పలు సమస్యలపై గిరిజన సంఘాలతో వెంటనే చర్చించాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా అంశాలపై గిరిజన సంఘాలను ఆహ్వానించి... ఉన్నతాధికారులు, గిరిజన ప్రజా ప్రతినిధులు చర్చించాలని సూచించారు. జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా చేస్తున్న ప్రయత్నాలను వివరించడంతో పాటు... ఈ ప్రక్రియలో వారిని కూడా భాగస్వాములు చేయాలని సూచించారు. చట్టపరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు కూడా తీసుకోవాలన్నారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1లోకి మార్చాలని, పోలవరం జిల్లాను జోన్ 2లో చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాక్సైట్ మైనింగ్ విషయంలో గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. గత పాలకులు తమ అవినీతి కారణంగా బాక్సైట్ లీజుల అంశం ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులకు వెళ్లిందని గుర్తు చేశారు. గిరిజనుల హక్కులకు, మనోభావాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు ఉండవని.... ఈ విషయంలో ఎవరి ట్రాప్ లోనూ పడవద్దని సిఎం సూచించారు. అలాగే 1/70 అమలు విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని... ఇదే విషయాన్ని గిరిజన సంఘాలకు చెప్పాలని సిఎం సూచించారు. అరకు కాఫీని ప్రమోట్ చేసినా... గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, రవాణా సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినా అది కూటమి ప్రభుత్వం గిరిజనులపై చూపిన బాధ్యత అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి జరిగినప్పుడే... వారి జీవన ప్రమాణాలు మారినప్పుడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం నమ్ముతోందన్నారు. గిరిజన సంఘాలతో చర్చలకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గిరిజన ప్రజాప్రతినిధులకు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. సిఎం సూచన మేరకు త్వరలోనే గిరిజన సంఘాలను ఆహ్వానించి చర్చించనున్నారు. సమీక్షలో మంత్రి సంధ్యారాణి, సీఎస్ సాయి ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ నాయక్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.