ఇప్పుడు ఏఐ ప్రపంచంలో వస్తున్న మార్పులను స్టడీ చేయాలి
విద్యార్థులతో భేటీలో సీఎం చంద్రబాబు టీచర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
చిత్తూరు: భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతోందనే అంశంపై విద్యార్థులు కూడా అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకోవడం వల్లే ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించారని అన్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీచర్ల ట్రైనింగ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏడాదికి 5 వేల మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా శిక్షణ ఇవ్వనున్నట్టు ఆగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం అకాడమీ ప్రాగంణంలోనే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆగస్త్య అకాడమీ ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశాను.. ఇప్పుడు ఏఐ గురించి అందరూ ఆలోచన చేయాలని చెబుతున్నా. విద్యార్థులు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.. భవిష్యత్ మనదే. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలు వస్తాయని అన్నారు. . కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు దక్కేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. డ్రోన్, స్పేస్ సిటీ వంటి వాటితో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను గమనించాలని వారికి సూచించారు. విద్యుత్ రంగంలో మార్పులు వస్తున్నాయి.. అందుకే విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించగలిగాం. టెక్నాలజీ అందిపుచ్చుకుంటే విద్యుత్ ఛార్జీలను తగ్గించవచ్చు. కుప్పంను ప్రయోగశాలగా చూస్తా.. ఇక్కడికి అన్ని రకాల టెక్నాలజీలు తెస్తున్నాం. హంద్రీ-నీవా ద్వారా కుప్పం వరకు నీళ్లు తెచ్చాం.. నీటి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. నీటి సంరక్షణ విషయంలో ఆగస్త్య అకాడమీ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచన చేయాలి. నీటి సంరక్షణ, నీటి సద్వినియోగం విషయంలో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టు చేపడదాం అని చంద్రబాబు తెలిపారు.