కడప నగరంలో కొన్ని రోజులుగా వెలుగులోకి వచ్చిన బ్యానర్లు ప్రజల్లో భారీ చర్చనీయాంశంగా మారాయి. “ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ… వెయ్యి రూపాయలకే థియేటర్ మీ సొంతం!”, “30 సెంట్లలో ఏసీ థియేటర్… కూపన్ కేవలం వెయ్యి రూపాయలు!” అంటూ ప్రత్యక్షమైన ఫ్లెక్సీలు ప్రజల్లో ఆసక్తి, ఆశక్తి, అనుమానాలు కలిగిస్తున్నాయి. పూర్తి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీతో సహా మొత్తం ప్రక్రియను నిర్వాహకులే చూసుకుంటామని చెప్పటంతో ఈ ప్రచారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయం ఏమిటి?
ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రేమ్ సాగర్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ ఈ లక్కీ డిప్ ఎలాంటి మోసం కాదని స్పష్టం చేశారు. ప్రచారంలో ఉన్న తహర్ థియేటర్‌ను కొన్నేళ్ల క్రితం రూ.8.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసామని, తర్వాత రూ.4.5 కోట్ల బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నామని వివరించారు. ఈ ప్రాపర్టీని విక్రయించే క్రమంలో అనేక ఇబ్బందులు, అడ్డు అడ్డంకులు ఎదురవడంతో కొత్త పద్ధతిని ఆలోచించామని చెప్పారు.
ఎందుకు లక్కీ డిప్?
ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి థియేటర్ కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాపర్టీని అమ్మడానికి “లక్కీ డిప్” ఐడియా ఉపయోగించామని వెల్లడించారు.
లక్కీ డిప్ ఎలా జరుగుతుంది?
-
లక్ష మందిని టార్గెట్‌గా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-
ఒక్క కూపన్ ధర రూ.1,000 మాత్రమే.
-
కూపన్లు కొనుగోలు చేసే అవకాశం మార్చి 28 వరకు ఉంటుంది.
-
మార్చి 29వ తేదీన లక్కీ డిప్ తీస్తారు.
-
లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డ్రా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
-
గెలుచుకున్న వ్యక్తికి థియేటర్‌ను పూర్తి రిజిస్ట్రేషన్ + స్టాంప్ డ్యూటీతో సహా వారి పేరుతో నమోదు చేసి ఇస్తారు.
ప్రస్తుతం దాదాపు 300 టోకెన్లు విక్రయించగా, రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ విస్తరిస్తూ కూపన్ల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
ప్రజల్లో చర్చలు
ఇంత పెద్ద ఆస్తి ఒక్క వెయ్యి రూపాయలకే దక్కుతుందా? ఇది నిజమేనా, లేక మరొక ప్రచారమా? అనే అనుమానాలు సహజంగానే ప్రజల్లో కనిపిస్తున్నాయి. అయితే నిర్వాహకుల వివరణ, వివరించిన ప్రక్రియ ప్రజలను ఆసక్తితో పాటు ఆలోచనలో పడేస్తోంది.