దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు తన జోరును కొనసాగిస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హాంకాంగ్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 137 వరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా యువ బౌలర్, తెలుగు తేజం శ్రీ చరణి తన అద్భుతమైన బౌలింగ్‌తో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా శ్రీ చరణి తన స్పెల్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. తన అద్భుతమైన బౌలింగ్‌తో హాంకాంగ్ పతనాన్ని శాసించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 3.2 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీ చరణి, 16 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో ఆమె ఒకే క్యాలెండర్ ఇయర్లో భారత మహిళల జట్టు తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. 2026 క్యాలెండర్ ఇయర్లో చరణి ఇప్పటివరకు మొత్తం 31 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో 2024లో 30 వికెట్లు తీసిన దీప్తి శర్మ రికార్డును ఆమె అధిగమించింది. ప్రస్తుతం ఈ జాబితాలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ అగ్రస్థానంలో ఉంది. ఆమె 2018లో 35 వికెట్లు తీసి ఈ రికార్డును నెలకొల్పింది. చరణి ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, ఈ ఏదాది. ముగిసేలోపు పూనమ్ యాదవ్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.