మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం (డిసెంబర్ 9) సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో గ్రామాల్లో అసలైన రాజకీయ గాలి వేగంగా మారింది. ప్రచారానికి ఫుల్స్టాప్ పడేముందే అభ్యర్థులు తమ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలకూ తెరలేపారు.
ఇళ్లకెళ్లి రేయింబవళ్లు నోట్లు పంచింపులు
రాత్రిపూట సైలెంట్‌గా ఇంటింటికీ వెళ్లి నోట్ల పంపిణీ ఇప్పుడు పల్లె రాజకీయాల్లో సాధారణంగా మారిపోయింది. చేతిలో డబ్బులు పెట్టిన తర్వాత తమకే ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటున్నారు. కొన్నిచోట్ల అయితే లిక్కర్, చికెన్, మటన్ వంటి తినుబండారాల పంపిణీ బాగా ఊపందుకుంది.
ప్రత్యర్థులు కూడా డబ్బులు పంచుతుండటంతో, ఓటర్ల నుండి పిల్లలు, దేవుళ్ల మీద ప్రమాణాలు చేయించుకునే పరిస్థితి వచ్చింది. వలస ఓటర్లకు వీడియో కాల్స్ చేసి గ్రామానికి వచ్చి తప్పకుండా ఓటు వేయమని అభ్యర్థులు బతిమిలాడుతున్నారు.
సెంటిమెంట్లతో ఓట్ల కోసమే పరితపన
ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎగోలను పక్కన పెట్టి సెంటిమెంట్లపైనే తమ ప్రచారాన్ని నడిపిస్తున్నారు.
వయసు పెద్ద, చిన్న అనే తేడా లేకుండా కాళ్లపై పడిపోవడం… అవసరమైతే సాష్టాంగ నమస్కారాలు చేయడం… అన్నీ చేస్తున్నారు.
ఇంకొందరు మరింత విచిత్రంగా ఓటర్లను హత్తుకుని,
“నువ్వే దిక్కు… నన్ను గట్టెక్కించు”,
“నీ కాళ్లు మొక్కుతా… నాకు ఓటేయ్”
అనే స్థాయికి దిగజారుతున్నారు.
ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ పూసి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రచార బాట పడుతూ, ఓటర్లు వ్యవసాయ పనులకెళ్లకముందే వారి ఇంటి ఎదుట నిలబడి తమ గుర్తుకు ఓట్లను అడుగుతున్నారు.
రాత్రి క్యాంపెయిన్ – అసలు రాజకీయ రంగు
పగటి మైకుల మోత ముగిసిన తర్వాత రాత్రి 8–9 గంటలకే అసలు రాజకీయ రంగు కనిపిస్తోంది. కుల పెద్దలతో రహస్య చర్చలు, తాయిలాల పంపిణీ వ్యూహాలు వేగంగా నడుస్తున్నాయి.
అధికారుల దృష్టికి చిక్కకుండా రాత్రి వేళల్లో ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బు, మద్యం పంచుతున్నారు. ఎక్కడ పోలీసులు, ప్రత్యర్థుల నిఘా బలంగా ఉంటే, అక్కడ యూపీఐ పేమెంట్లు—ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా ఆన్‌లైన్‌గా అమౌంట్లు పంపుతున్నారు.
కొన్ని గ్రామాల్లో కిరాణా దుకాణాలు, మద్యం షాపులు, పెట్రోల్ బంకుల్లో ఉపయోగించుకునే స్లిప్పులు పంచి, ఎన్నికల తర్వాత బిల్లులు క్లియర్ చేస్తామని ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా వెలుగులోకి వస్తోంది.
వలస ఓటర్లకు ప్రత్యేక ‘ఆఫర్లు’
పలుచోట్ల వలస వెళ్ళిన ఓటర్లకు ఫోన్లు చేసి,
“వచ్చి ఓటేసి వెళ్తే మీ ఖర్చు మేం చూసుకుంటాం,”
అని వేడుకుంటున్నారు. బస్సు ఛార్జీలు మాత్రమే కాదు, ఓటుకు అదనంగా ఎంత ఇస్తామో కూడా ఆన్లైన్లోనే పంపుతున్నారు.
ఎన్నికలకు ముందురోజు పీక్స్ కి చేరిన హీట్!
డిసెంబర్ 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు గెలుపు కోసం తమ సర్వశక్తులూ వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా డబ్బు, మద్యం, భావోద్వేగాలు—మూడూ కలిసి పంచాయతీ రాజకీయాల్లో కొత్త రకం పోటీ వాతావరణం సృష్టించాయి.