భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ 2026 లో చాలా బిజీగా ఉండబోతోంది. వచ్చే ఏడాది క్యాలెండర్లో ప్రతిష్టాత్మక టోర్నీలు ఆడనున్న టీమ్ ఇండియాకు కీలకం కానుంది. ఒకవైపు, భారత్ ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు, ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడం ఇప్పుడు భారత జట్టు ముందున్న అతిపెద్ద సవాల్ మారింది. ముఖ్యంగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయం భారత టెస్ట్ చరిత్రలోనే ఘోరమైన ఓటమిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 2026లో జరిగే టెస్ట్ సిరీస్‌లు భారత జట్టుకు పరీక్షగా మారనున్నాయి. అఫ్గానిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనల్లో టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో భారత్ తిరిగి ప్రపంచ టెస్ట్ క్రికెట్లో తన స్థానం నిలబెట్టుకోగలదా? వైట్‌బాల్ క్రికెట్లో 2025లో భారత్ ఆధిపత్యం చలాయించింది. చాంపియన్స్ ట్రోఫీ విజయంతో పాటు, టీ20లో నెంబర్ 1 జట్టుగా భారత్ నిలిచింది. నూతన సంవత్సర ఆరంభంలోనే న్యూజిలాండ్‌తో భారత్ వన్డేలు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ పర్యటనలో మొత్తం 3 వన్డేలు, 5 టీ20లు జరుగుతాయి. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ తన లీగ్ మ్యాచ్‌లను కింది తేదీల్లో ఆడనుంది. వచ్చే ఏడాది టీమ్ ఇండియా దాదాపు 5 టెస్టులు, 18 వన్డేలు, 20 పైగా టీ20లు (ఆసియా క్రీడలు, వరల్డ్ కప్ తో కలిపి) ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. వీరిద్దరు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినందున వన్డేల్లోనే ఆడతారు. కాబట్టి 2026లో ఈ ఇద్దరు లెజెండ్స్ 12 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో మైదానంలో అడుగుపెట్టనున్నారు. అయితే 2026లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. 2026వ సంవత్సరంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఫుల్ బిజీగా ఉండనుంది. భారత మహిళల జట్టు ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే, భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ఒక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూలై 10న ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరిగే 20వ ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు పాల్గొంటుంది. గత ఎడిషన్‌లో గెలిచిన స్వర పతకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా టీమ్ ఇండియా బరిలోకి దిగుతుంది.