టీమిండియా ముమ్మరంగా సాధన
నేడు నమీబియాతో అమీతుమీ
గ్రూప్-ఏలో ఢిల్లీ వేదికగా మ్యాచ్
సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి..
అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చే చాన్స్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌లో నమీబియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాలని భావిస్తోంది. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం సందేహంగా మారింది. ప్రస్తుతం అతను ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అమెరికాతో మ్యాచ్‌లోనూ ఇదే సమస్యతో బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ ఫీల్డింగ్‌కు రాలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో కనిపించలేదు. అభిషేక్ శర్మ ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని బ్యాటింగ్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే మీడియాకు తెలిపాడు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉందని, ఆ సమయానికి కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పాడు. మరోవైపు సంజూ శాంసన్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలిసి బ్యాటింగ్ సాధన చేశాడు. ఈ క్రమంలోనే నమీబియాతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా నమీబియాతో మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మకు విశ్రాంతి కల్పించనున్నారు. న్యూజిలాండ్ సిరీస్ లో దారుణంగా విఫలమై తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్‌కు ఇది సువర్ణవకాశం. ఈ మ్యాచ్‌లో అతను భారీ ఇన్నింగ్స్ చెలరేగితే.. తుది జట్టులో కొనసాగుతాడు. ఓపెనర్లు ఇద్దరూ లెఫ్టార్మ్ బ్యాటర్లే అయిన నేపథ్యంలో సంజూ శాంసన్ ఫామ్‌లోకి వస్తే అతనికి ప్రాధాన్యత లభిస్తోంది. తీవ్ర జ్వరంతో అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అదే జరిగే మహమ్మద్ సిరాజ్‌పై వేటు పడనుంది. అమెరికాతో మ్యాచ్‌లో సిరాజ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయినప్పటికీ బుమ్రా రీఎంట్రీతో అతను బెంచికే పరిమితం కానున్నాడు. ఎక్స్ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగితే అర్హ దీప్ సింగ్ కూడా బెంచికే పరిమితమవుతాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతాడు. మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది.
నమీబియాతో తలవడే భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ/సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తీ.