తిరుమలలో శ్రీవారిని దర్షించుకోవడానికి భక్తులు ఎంత ఆరాటపడతారో అంతేస్థాయిలో తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం కూడా ప్రయత్నిస్తారు. శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులకు ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. అది కాకుండా ఒక్కోదానికి 25 రూపాయల చొప్పున అదనంగా రెండు లడ్డూలను ఇస్తారు. అయితే, ఇప్పటివరకూ లడ్డూల కౌంటర్ లో డబ్బు చెల్లించి అదనపు లడ్డూలు తీసుకునే పరిస్థితి ఉండేది. దీనికోసం లడ్డూల కౌంటర్ల వద్ద విపరీతమైన రద్దీ ఉంటూ వస్తోంది. దీంతో దర్శన అనంతరం లడ్డూల కోసం క్యూలైన్లలో నిలబడాల్సి రావడం భక్తులకు తీవ్ర ఇబ్బందులను తెస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించడం కోసం.. కౌంటర్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించే అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ.
తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా భక్తులు పేమెంట్ ద్వారా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.
కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం ఇలా ఉంది..
భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ లో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:
1.దర్శన టికెట్ ఉన్నవారు
2.దర్శన టికెట్ లేనివారు
దర్శన టికెట్ ఉన్నవారు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి..
- టికెట్ వివరాలను కియోస్కీ ధృవీకరిస్తుంది.
- టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
దర్శన టికెట్ లేనివారికోసం..
ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన(verified) ఆధార్ నంబర్ ఇవ్వాలి.
ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
- సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
- చెల్లింపు అనంతరం ప్రింటెడ్ రిసిప్ట్ అందుతుంది.
- ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు.
భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. .