తమిళ సినీ పరిశ్రమలో ఓ పోస్ట్ చర్చనీయంగా మారింది. ప్రముఖ గాయని స్వగత కృష్ణన్ చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరు ప్రస్తావించకుండా ఓ వ్యక్తిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆ వ్యక్తి మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపులు, బ్లాక్ మెయిల్, బలవంతపు మత మార్పిడి చేశాడని, అలాంటి వ్యక్తికి ఇండస్ట్రీ కి సపోర్టుగా నిలిచిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. సింగర్ స్వగత కృష్ణన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ఓ సంగీత దర్శకుడి స్టూడియోలో తనను లైంగిక వేధించాడనీ, స్టూడియోలో సౌండ్ ప్రూఫ్ గది, సీసీటీవీ కెమెరాలు ఉ న్నాయని.. అక్కడ జరిగిన ఘటనను రికార్డు చేసి, ఆ ఫుటేజ్‌ను ఉ పయోగించి తనను బెదిరించారని ఆమె పేర్కొన్నారు. తనకు మాత్రమే కాకుండా మరికొంతమంది మహిళలకు కూడా ఇదే వ్యక్తి వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని స్వగత ఆరోపించారు. ఈ పరిణామాల కారణంగానే తాను చెన్నైని విడిచి రిషికేశ్కు వెళ్లినట్లు వెల్లడించారు. ఇప్పుడు స్వగత చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఆ వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది. పేరు చెప్పకుండా ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. పలువురు బాధిత మహిళలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ వ్యక్తికి సినీ పరిశ్రమలో మద్దతు లభిస్తుంది. ఆ వ్యక్తి ప్రస్తుతం తన సామాజిక ప్రతిష్ట, పీఆర్, ప్రజాభిప్రాయం గురించి ఇంటర్వ్యూలు ఇస్తుండటం ఎలా సాధ్యమవుతోందని ఆమె ప్రశ్నించారు. ఒకవైపు ఇలాంటి ఆరోపణలు ఉ ండగా.. మరోవైపు పరిశ్రమలో అతడికి గౌరవం, స్వాగతం లభిస్తుండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వగత తాజా పోస్టులో మరో కీలక విషయాన్ని ప్రస్తావించింది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఓ భక్తి ప్రధానమైన సినిమాకు సంగీతం అందిస్తున్నారని తెలిపింది. ఈ ఒక్క అంశం సోషల్ మీడియాలో చర్చకు మరింత ఆజ్యం పోసింది. అంతే కాదు.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బహిరంగ కార్యక్రమాలకు ఆహ్వానించడం, వేదికపై అతడికి కేక్ తినిపిస్తున్నారనీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ ఎవరి పక్షాన నిలబడుతుందనీ ప్రశ్నించింది. ఇక చివరిలో 'నెక్స్ట్..' అంటూ తన ట్విట్ ముగించింది సింగర్ స్వగత. ఇలాంటి ఉత్కంఠ రేపడంతో త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించబోతున్నారా? ఇప్పటివరకు చెప్పని విషయాలను బయట పెట్టబోతున్నారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆమె గత ఆరోపణలపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగిన నేపథ్యంలో.. తాజా పోస్టు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆమె తదుపరి పోస్టులో ఏదైనా వ్యక్తి పేరు లేదా కీలక ఆధారం బయట పెడతారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.