అనకాపల్లి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని
జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీసులు ముందస్తు శు భాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వేడుకల పేరుతో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హెూటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వినోద కార్యక్రమాల్లో అశ్లీలత, నగ్న ప్రదర్శనలు పూర్తిగా నిషేధమన్నారు. అలాగే, కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా ముగించాలని సూచించారు. పార్టీల్లో డ్రగ్స్, నార్కోటిక్స్ తదితర మత్తు పదార్థాల వినియోగంపై కఠిన నిఘా ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
యువత బైక్‌రేసింగ్‌లు, కారు రేసింగ్‌లకు పాల్పడకూడదని, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. మహిళలు, బాలికలపై వేధింపులను అరికట్టేందుకు సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నివారణ దృష్ట్యా బాణాసంచా కాల్చడాన్ని నిషేధించామని, డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై పరిమితులు విధించినట్లు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు కీలక ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామని చెప్పారు. అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు డి. దేవప్రసాద్ (అడ్మిన్), ఎల్. మోహన్ రావు (క్రైమ్), అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సహా ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.