కుక్కల భయంతో చిన్నారులను పాఠశాలలకు
పంపేందుకు తల్లిదండ్రుల ఆందోళన
ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాలి
గండ్రోతు దుర్గాసురేష్
రావులపాలెం: గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల బెడదను అరికట్టి ప్రజలను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజా సేవకుడు గండ్రోతు దుర్గానురేష్ కోరారు. మంగళవారం ఈతకోట గ్రామంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పలు వీధుల్లో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతు న్నారని తెలిపారు. రాత్రి వేళల్లో కుక్కల అరుపులు, స్వైరవిహారం కారణంగా ప్రజలు బెంబేలెత్తుతున్నారని పేర్కొన్నారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో కుక్కలు బైకులకు అడ్డుపడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు గాయాలపాలవుతున్నారని తెలిపారు. చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయవదాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా ఇళ్ల నుంచి పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇటీవల గ్రామంలోని కమ్యూనిటీ హాల్, రామాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎంపీపీ పాఠశాల, మెయిన్ రోడ్డు సమీపంలోని ప్రాంతాలు, ఆలయాల వద్ద కుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. గతంలో గ్రామంలో ఇంత పెద్ద సంఖ్యలో వీధి కుక్కలు లేవని, బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వదిలి ఉంటారనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రోజూ కుక్కల బెడదతో నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని దుర్గాసురేష్ తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉ న్నతాధికారులు స్పందించి ఈతకోటలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజలను వాటి బారి నుంచి రక్షించాలని కోరాడు.