ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' నూతన సంవత్సరం సందర్భంగా డార్లింగ్ అభిమానులకు దర్శకుడు సందీప్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. మూవీలోని ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటివరకూ తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించారు.ఒళ్లంతా గాయాలతో కమిలిపోయి ఉండగా, బ్యాండ్-ఎయిడ్లు కట్టుకుని ప్రభాస్ వెనక్కి తిరిగి నిలబడ్డారు. ఆయన ముందు త్రిప్తి దిమ్రి నిలబడి ఉంది. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. చూడడానికి 'యానిమల్'లో రబ్బీర్ పాత్ర ఛాయలు కనిపిస్తున్నా, ప్రభాస్ కటౌట్ కావడంతో అంతకు మించిన హైఓల్టేజ్ యాక్షన్ చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. 'ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడు/ఆజానుబాహు'ను చూడండి. హ్యాపీ న్యూఇయర్ 2026' అని సందీప్ వంగా పేర్కొన్నారు. 'మీరు ఇప్పటివరకూ ఉన్న దానిని ప్రేమించారు. ఇక నుంచి మీకు తెలియనిదానితో ప్రేమలో పడండి' అని టీమ్ పేర్కొంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. సినిమా ప్రారంభం సందర్భంగా 'సౌండ్ స్టోరీ' పేరుతో ఓ ఆడియో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారి అయినా రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జైలర్‌గా ఉన్నప్రకాశ్ రాజ్, ప్రభాస్ కీ మధ్య సంభాషణ టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా 'స్పిరిట్'లో సందీప్ చూపించబోతున్నారట. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఇందుకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ వంచుతాయని తెలుస్తోంది. ఇదే కథకు ప్రాణమని, మొత్తం సినిమాను మలుపు తిప్పే ఎపిసోడ్ అవుతుందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇందులో త్రిప్తి దిమ్రో కథానాయిక. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. టి - సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ సంస్థలపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్ నిర్మిస్తున్నారు.