స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ బేబీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నందిని రెడ్డి, సమంత కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు కూడా ఆకట్టుకోవడంతో సినిమా సమ్మర్ సీజన్ లో మంచి హిట్ అవుతుందని మూవీ లవర్స్ భావించారు. అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితి మొత్తం మారిపోయినట్లుగా కనిపిస్తోంది. మొదట మే 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఆ చిత్రానికి ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సమంత సినిమా అంటే ముందుగానే భారీ హైప్, ప్రమోషనల్ ఈవెంట్స్ ఉండటం సహజం. కానీ ఈసారి మాత్రం సామ్ పూర్తిగా సైలెంట్ గా ఉండడం అభిమానుల్లో సందేహాలను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమా వాయిదా పడుతుందనే వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదట మే రిలీజ్ అనుకున్నా, తర్వాత జూన్ 4 తేదీకి షిఫ్ట్ అవుతుందనే టాక్ వచ్చింది. కానీ అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఆ తేదీని లాక్ చేసుకోవడం వల్ల పరిస్థితి మారింది. ముఖ్యంగా పెద్ది సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతుండగా, మరో చిత్రం లెనిన్ జూన్ 26న రానుంది. దీంతో మా ఇంటి బంగారం సినిమాకు సరైన రిలీజ్ స్లాట్ దొరకడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకటి ముందుగా అనుకున్నట్లే మే 15న విడుదల చేయడం, లేకపోతే జూన్ మధ్యలో లేదా జూలైకి వాయిదా వేయడం. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే జూలై రిలీజ్ వైపు టీమ్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.