తిరువనంతపురం : శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో చోరీకి గురైన బంగారంలో ఇప్పటివరకు దొరికినదానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అనుమానిస్తోంది. ఇప్పటి వరకు రికవరీ జరిగిన సొత్తు విలువను అంచనా వేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఉందా అని ఆరా తీస్తున్నారు. ముగ్గురు నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కొల్లం విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో సిట్ ఈ అనుమానం వ్యక్తం చేసింది. 2019లో బంగారం పూత పూసిన రాగి రేకులను ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు అప్పగించారని సిట్ తన పిటిషన్లో పేర్కొంది. ఆ ప్లేట్ల మొత్తం బరువు 42.100 కేజీలు కాగా ఎలక్ట్రోప్లేట్రింగ్ పక్రియ పూర్తైన తర్వాత మిగిలిన బంగారాన్ని నిందితులు మింగేశారని అభియోగం. ద్వారపాలక విగ్రహాల నుంచి, వాటికి సమీపంలోని రెండు స్తంభాల నుంచి బంగారం పూసిన రేకుల్ని తొలగించారని, గర్భగుడి ద్వారం నుంచి ఇలాంటి ఏడు రేకులు తొలగించి వాటికి బంగారు పూత తిరిగి పూశారని సిట్ కోర్టుకు తెలిపింది. గర్భగుడి నుంచి తొలగించిన ప్లేట్లలో రెండింటిపై విష్ణుమూర్తి దశావతారాలు చెక్కి ఉన్నాయని వివరించింది. ఎలక్ట్రోప్లేట్రింగ్ అనంతరం ఉ న్నికృష్ణన్ పొట్టి తనకు 474.90 గ్రాముల బంగారం ఇచ్చాడని గోవర్ధన్ అనే మరో నిందితుడు తెలియజేసి ఆమేరకు సిట్‌కు బంగారం అప్పగించాడు. ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు పూసిన రాగి ప్లేట్లపై వాస్తవానికి ఇంకా ఎక్కువ పరిమాణంలో బంగారం ఉ ందని సిట్ వెల్లడించింది. ఈ కేసులో బంగారాన్ని దొంగిలించిన వ్యక్తి, కొన్న వ్యక్తి కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఎలా కలవగలిగారని ముఖ్యమంతి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తు కేరళ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోందని, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు తన కార్యాలయ జోక్యమేమీ లేదని స్పష్టంచేశారు. సిట్ దర్యాప్తుపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు.