ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన హీరో
అగ్రకథానాయకుడు అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 'షోస్టాపర్స్ 2026' ప్రత్యేక సంచిక కవర్ పేజీపై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు, సినిమాలో కథ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. బాలీవుడ్, దక్షిణాది సినిమా లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమా అయినా సరే.. బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందాలంటే కథే ప్రధానం. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా హిట్ అవుతుంది. కొత్త కథను ప్రేక్షకులకు అందించడమే అన్నిటికంటే ముఖ్యం' అని అల్లు అర్జున్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సినిమాల్లోని నటీనటుల స్టార్డమ్ కంటే కూడా సరైన కథే చిత్ర విజయాన్ని నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్.. ఇలా వివిధ రంగాల్లో ప్రభావం చూపిన 100 మంది తారల జాబితాను 'షోస్టాపర్స్' పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు చోటు దక్కించుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, రజనీకాంత్, రామ్ చరణ్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ దేవోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ ఇందులో ఉన్నారు.