తాజా బ్లాక్‌బస్టర్ 'ధురంధర్ 2 పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న ప్రభంజనాన్ని చూసి.. ఆదిత్య ధర్ పనితీరును మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదిత్యను 'బాక్సాఫీస్ కా బాప్' అని ప్రశంసించడమే కాకుండా సినిమా అద్భుతంగా ఉందని రజనీకాంత్ కొనియాడారు. ఈ సందర్భంగా హీరో రణవీర్ సింగ్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రతి భారతీ-యుడు చూడాల్సిన సినిమా అని అన్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తలైవా పోస్ట్‌కు ఆదిత్య ధర్ ఎమోషనల్ రిప్లై పెట్టారు. 'మేమందరం వినోదం అనే పదానికి మీ ఒక్కరినే బెంచిమార్క్ చూస్తూ పెరిగాము. దశాబ్దాలుగా మమ్మల్ని విజిల్స్ వేయించేలా, నవ్వించేలా, భావోద్వేగానికి గురయ్యేలా.. మీరు వినోదానికి అసలైన అర్ధం చెప్పారు. ఇప్పటికీ అదే స్టైల్.. అదే గ్రేస్‌తో మీరు చేస్తున్న మ్యాజిక్ అద్భుతం. అలాంటిది మీరు 'ధురందర్ 2'ను తప్పక చూడాల్సిన చిత్రం అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద 'సూపర్ స్టార్' మూమెంట్‌గా అనిపిస్తోంది. పెద్ద కలలు కనేలా మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి నుంచి అందిన ఈ ప్రశంస ఒక వరంలా ఉంది. మీ మాటలకు నా హృదయం ఉప్పొంగుతోంది' అని దర్శకుడు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మార్చి 19న విడుదలైన 'ధురంధర్ 2' చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.750 కోట్ల మార్కును దాటి రికార్డులు తిరగరాస్తోంది. రజనీకాంత్ తో పాటు అల్లు అర్జున్, మహేశ్ బాబు, నాగార్జున వంటి ఇతర అగ్ర తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.