కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగకపోయుంటే, తమ పార్టీ అధికారంలోకి వచ్చేదని ఆయన తెలిపారు. నకిలీ, డూప్లికేట్, బల్క్ ఓటింగ్ కారణంగానే బీజేపీ గెలిచిందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు.
దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మా వద్ద హైడ్రోజన్ బాంబ్లా పేలే సమాచారం ఉంది” అని పేర్కొన్నారు. ఈ సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను తాము ‘హెచ్-ఫైల్స్’ (H-Files)గా పిలుస్తున్నామని వెల్లడించారు. ఈ ఫైల్స్‌లో ఉన్న ఆధారాలు బీజేపీ ఎన్నికల్లో ఎలా ఓట్ల చోరీ జరిపిందో, ఎన్నికల సంఘం ఎలా సహకరించిందో చూపుతాయని ఆయన అన్నారు.
“సీఈసీ, ఇద్దరు కమిషనర్లు బీజేపీతో చేతులు కలిపారు”
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. వారు ప్రధాని నరేంద్ర మోదీతో సఖ్యత చూపి హరియాణాలో బీజేపీకి గెలుపు సాధించారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్‌ను ఓడించేందుకు ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ పేరుతో కుట్ర జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఈ అంశాన్ని దేశ యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen-Z) తరం సీరియస్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. “ఓట్ల చోరీ ద్వారా జెన్-జీ నుంచి భవిష్యత్తును దోచేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. “ఇళ్లులేని వారికి ‘జీరో’ నంబర్ కేటాయిస్తామని చెప్పి, ఆ పేరుతో నకిలీ ఓట్లు సృష్టించారు. ఇప్పుడు ఆ దందాదేశమంతా బయటపడింది” అని అన్నారు.
“25 లక్షల నకిలీ ఓట్లు — ఒక్క ఫొటోకు 223 ఓట్లు”
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల ప్రకారం, 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని అన్నారు.
ఒక బ్రెజీలియన్ మోడల్ ఫొటోతో నకిలీ ఓట్లు రిజిస్టర్ చేయబడ్డాయని, ఆ ఫొటో ఆధారంగా అనేక పోలింగ్ బూత్‌లలో ఓట్లు వేసారని రాహుల్ తెలిపారు.
“ఒక్క ఫొటోపై 223 ఓట్లు జారీ చేశారు. అదే మహిళ ఫొటోతో 10 వేర్వేరు పోలింగ్ బూత్‌లలో 22 సార్లు ఓటువేసింది. ఆ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ కేవలం 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది,” అని ఆయన వివరించారు.
ఈ విధంగా హరియాణా అంతటా సుమారు 12.5 శాతం ఓటర్లు నకిలీగా ఉన్నారని, 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ పేర్కొన్నారు. పోస్టల్ ఓట్లు, బూత్ ఓట్ల లెక్కల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు.
“ఈ ఎన్నికల్లో ఏమి జరిగిందో దేశానికి చూపించడానికి ‘హెచ్-ఫైల్స్’ సరిపోతాయి. బీజేపీ, ఈసీ, కొంతమందిఅధికారులు కలిసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారు. కానీ సత్యం దాచలేరు,” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన విడుదల చేయనున్న ‘హెచ్-ఫైల్స్’లో ఏ విధమైన ఆధారాలు ఉన్నాయో చూడాల్సి ఉంది. రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలు హరియాణా రాజకీయాలను మళ్లీ కుదిపేశాయి.