టీమిండియా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. గాయాలు, రిహాబిలిటేషన్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల స్టార్ ఆటగాళ్లు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం, భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుండగా.. మరోవైపు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రేయర్లు వర్కౌట్లు చేస్తూ రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బెంగళూరులోని వర్కౌట్స్, ట్రైనింగ్ సెషన్లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్ పేసర్ జస్త్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన గాయం నుంచి వేగంగా కోలుకుంటూ పునరావాస శిక్షణ పొందుతున్నాడు. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, యంగ్ పేసర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే, స్పిన్నర్ రవి బిష్ణోయ్, సూర్యాంశ్ షెడ్గేలు ఒకే చోట తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ ప్లేయర్ల ఫోకస్ అంతా రాబోయే ద్విపాక్షిక సిరీస్ పైనే ఉంది. సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న 3 మ్యాచ్ ల టీ20 అంతర్జాతీయ సిరీస్ సమయానికి ఈ వైట్ బాల్ స్టార్లు పూర్తి ఫిట్నెస్ సాధించాలని చూస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ లో వెస్టిండీస్ జట్టుతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు ఈ కీలక ఆటగాళ్లందరూ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఆటగాళ్లకు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇవ్వడం, గాయాల నిర్వహణపై కొన్ని ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియా సమావేశంలో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. ఎంపిక ప్రక్రియలో, ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికలలో పూర్తి పారదర్శకత ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆటగాడు మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోకపోతే మరికరిని ఎంపిక చేస్తారని అర్థం. తాము నిందలు వేసేందుకు ఇష్టపడమని.. ప్లేయర్లు కోలుకునే పురోగతిని ప్రతి దశలో పర్యవేక్షిస్తూ సెలెక్షన్ కమిటీకి నివేదిస్తామని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. మొత్తానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో స్టార్ ప్లేయర్ల కఠోర శ్రమ చూస్తుంటే.. త్వరలోనే భారత వైట్- బాల్ జట్టు పూర్తి బలంతో మైదానంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.