పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పౌరాణిక చిత్రం హరిహరవీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం ఆయన అభిమానులు గతకొన్ని సంవత్సరాలుగా తహతహలాడుతూ ఎదురుచూస్తున్నారు. మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం, అనంతరం జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు మారాయి. కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రం గత కొన్ని నెలలుగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసుకుని ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అభిమానులను ఆనందంలో ముంచి, భావోద్వేగాలను నింపింది. ఆయన మాటల్లో రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం అన్నీ వినిపించాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణలో సభకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తన ధన్యవాదాలు. రాజకీయాల్లో మంచి స్నేహితుడు దొరికాడు… ఆయనే ఈశ్వర్ అంటూ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ను ఉద్దేశించి చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
తన సినీ ప్రయాణం గురించి
“పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ఆశపడలేదు. యాక్టర్ కావాలన్న కోరిక లేదు. సగటు మనిషిగా బతకాలన్నదే నా ఆలోచన. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు గానీ, గూండాలు గానీ నాదగ్గర లేవు. వయసు పెరిగింది కానీ… గుండెల్లో చావ చావలేదు.”
డబ్బుకు కంటే బంధాలకు ప్రాధాన్యత
“నేను డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. బంధాలకే ఇచ్చాను. హరిహరవీరమల్లు సినిమా ఎంతో కష్టపడి చేశా. పేరు ఉంది, ప్రధాని తెలుసు… పెద్ద నాయకులు తెలుసు అని చెప్పుకుంటే డబ్బులు రావు. కింద నుంచి వచ్చినవాడిని. పెద్ద డైరెక్టర్లు నన్ను డైరెక్ట్ చేయలేదు. రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయన్నారు. నేను చేసిన పాపమల్లా ఒక ఫ్లాప్ ఇచ్చా. దాని తర్వాత ఇండస్ట్రీలో గ్రిప్ రాలేదు.”
త్రివిక్రమ్ గురించి..
“క్లిష్టమైన ఆ టైమ్‌లో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు త్రివిక్రమ్. జల్సా మూవీని గిఫ్ట్ గా ఇచ్చాడు. నా మిత్రుడు… ఆత్మబంధువు. ఆయన వల్లే మళ్లీ కొత్త కథలు చేయగలిగాను.”
క్రిష్ గురించి..
“వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయాడు. కానీ సినిమా పూర్తి చేయాలన్న నిశ్చయంతో జ్యోతికృష్ణ ముందుకు వచ్చాడు.”
అభిమానుల కోసం..
ఈ సినిమా కోసం నాకున్న శక్తినంతా పెట్టాను. మీకోసం డ్యాన్స్‌లు కూడా చేశాను. రాజకీయాల్లోకి వచ్చాక రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొన్నా కానీ, సినిమాటిక్‌గా చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ సాధన చేసి, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌కు దర్శకత్వం వహించా. ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను. మీరు కోరుకునే సక్సెస్ నేనూ కోరుకుంటున్నా. మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుంది. మీ కష్టాలను తీర్చడానికి కొట్టుకుంటుంది.
ఈ వేడుక ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి తన సినీ ప్రయాణం వెనక ఉన్న భావోద్వేగాల్ని, తన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను అభిమానులకు వెల్లడించారు. హరిహరవీరమల్లు విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు మాత్రం పవన్‌ను మళ్లీ భారీ హిట్‌తో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.